ఏపీలో సినిమా టికెట్ల వ్యవహారం రోజురోజుకీ ముదిరిపోతోంది. మెల్ల మెల్లగా థియేటర్లన్నీ మూసివేస్తుండటంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. టికెట్ల రేట్ల వ్యవహారంలో థియేటర్లు మూసేసి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయి యాజమాన్యాలు. అటు తెలంగాణ వ్యవహారాన్ని చూపి ఏపీ ప్రభుత్వంతో చర్చలకు రెడీ అవుతున్నారు ఇండస్ట్రీ పెద్దలు. ఇప్పటికే పలుమార్లు చర్చలు జరిపినా ప్రయోజనం లేకపోవడంతో ఈ సారి కాస్త గట్టిగానే అడగాలనేది ఇండస్ట్రీ నుంచి వస్తున్న ప్రతిపాదన. అయితే టాలీవుడ్ పెద్దలు చెప్పిన మాటలు సీఎం జగన్ ఆలకిస్తారా.. లేక ఎప్పటి లాగానే వ్యవహరిస్తారా అనేది కొద్దిరోజుల్లోనే తేలిపోనుంది.

ఏపీలో జీవో నెంబర్ 35 అమలు చేయడంతో థియేటర్ల యాజమాన్యాలకు దిక్కుతోచడం లేదు. ఇప్పటికే కృష్ణా జిల్లాతో పాటు చిత్తూరు జిల్లాలోనూ పలు థియేటర్లు మూతబడ్డాయి. తగ్గించిన టికెట్ రేట్లతో థియేటర్ నడపడం తమ వల్ల కాదంటూ యాజమాన్యాలు చేతులెత్తేస్తున్నారు. అధికారుల దాడులు కూడా అధికం కావడంతో నిర్వహణ వీలు కాదంటూ తెగేసి చెప్పేస్తున్నారు. టికెట్ రేట్లు పెంచకుండా, థియేటర్ లో మెరుగైన వసతులు అందించడం ఎలా అంటూ థియేటర్ యాజమాన్యాలు ప్రశ్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సినిమా థియేటర్ల విషయంపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జోరుగా సాగుతోంది. సినీ ప్రేమికులు కూడా ఈ విషయంలో కాస్తంత అసంతృప్తిగానే ఉన్నారని తెలుస్తోంది.  

తెలంగాణాలో అయితే టికెట్ రేట్లను పెంచుకునేందుకు ప్రభుత్వం అంగీకరించింది. టికెట్ రేట్లు పెంచుకునేందుకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. దీంతో మెగాస్టార్ చిరంజీవి కూడా సీఎం కేసీఆర్ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కేసీఆర్ కు, ప్రభుత్వ ప్రతినిధులకు కృతజ్ఞతలు చెప్పారు. ఇదిలా ఉండగా ఏపీలో మాత్రం సినిమా టికెట్ల రేట్లను భారీగా తగ్గించడంపై ఇండస్ట్రీ ప్రస్తుతానికి మౌనం పాటిస్తోంది. తెర వెనుక మాత్రం నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు ప్రభుత్వంలోని పెద్దలపై ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం అందుతోంది. అయితే ఈ నేపథ్యంలో టికెట్ రేట్ల విషయంలో వైసీపీ వెనక్కి తగ్గితే పార్టీ పరువు పోయినట్టేనని విశ్లేషకులు అంటున్నారు. ఇండస్ట్రీ నుంచి వస్తున్నఒత్తిడిని అధిగమించి రేట్లను ఇలాగే తగ్గించే ఉంచితే మాత్రం జగన్ సక్సెస్ అయినట్టే లెక్క.

మరింత సమాచారం తెలుసుకోండి: