రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేయటం ఖాయమనే బీజేపీ నేతలు ఫీలైపోతున్నట్లున్నారు. విజయవాడలో జరిగిన ప్రజాగ్రహసభలో పార్టీలోని చాలామంది సీనియర్ నేతలు హాజరయ్యారు. ఎప్పుడు ఎన్నికలు పెట్టినా సరే అధికారంలోకి వచ్చేది మాత్రం తామే అన్నట్లుగా గొంతుచించుకున్నారు. జాతీయనేత జవదేకర్ దగ్గర నుండి రాష్ట్రంలో ఒకమాదిరి నేత వరకు ప్రత్యర్ధిపార్టీలపై ఆకాశమే హద్దుగా రెచ్చిపోయారు.




బీజేపీ చీఫ్ సోమువీర్రాజు ఒకడుగు ముందుకేసి స్టేజీ మీద కూర్చున్న వాళ్ళలో మంత్రిపదవులకు ఎవరు తక్కువ, వీళ్ళల్లో ప్రభుత్వానికి నాయకత్వం వహించటానికి అర్హత లేదా ? అంటు స్టేజీ మీద కూర్చున్నవారిని చూపించి అడగటమే ఆశ్చర్యంగా ఉంది. పదవులు అందుకోవటానికి, మంత్రిగా సీఎంగా పనిచేయటానికి అర్హతతో పనేలేదు. అదృష్టం ఉంటే పదవులు వాటంతట అవే తన్నుకొస్తాయి. పదవులకు అర్హతనే ప్రామాణికంగా తీసుకుంటే ఎంతమంది సరిపోతారు ?




కాబట్టి ఆ విషయాలను వదిలేద్దాం. ప్రజాగ్రహసభలో సోము వీర్రాజుతో కలిపి వేదిక మీద చాలామందే కూర్చున్నారు. వీరిలో ఎంతమందికి జనబలముంది అనేది ఇక్కడ ప్రశ్న. సుజనాచౌదరి, సీఎం రమేష్, పురందేశ్వరి, విష్ణువర్ధనరెడ్డి, ఆదినారాయణరెడ్డి, పాతూరి నాగభూషణం, సత్యమూర్తి, కన్నా లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళని తీసుకుంటే వీళ్ళకున్న జనబలం ఏమిటో అందరికీ తెలిసిందే. మీడియా సమావేశాల్లో లేకపోతే పార్టీ సమావేశాల్లో, బహిరంగసభల్లో మాట్లాడమంటే బ్రహ్మాండంగా మాట్లాడుతారు.




అయితే వీళ్ళ వల్ల పార్టీకి వంద ఓట్లు కూడా వచ్చేది అనుమానమే. కన్నా, పురందేశ్వరి గతంలో గెలిచారంటే అది కాంగ్రెస్ పార్టీ చలవనే చెప్పాలి. మొన్నటి ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీచేస్తే కనీసం డిపాజిట్లు కూడా తెచ్చుకోలేకపోయారు. ఇక చాలామంది నేతలు అసలు పోటీయే చేయలేదు. ఈమధ్యనే జరిగిన స్ధానికసంస్ధల ఎన్నికల్లో వీళ్ళల్లో ఎవరూ పదిమందిని కూడా గెలిపించుకోలేకపోయారు. సుజనా, రమేష్ కు అయితే అసలు జనాలతో సంబంధమే లేదు.




ఇలాంటి వాళ్ళని చూపించి మంత్రపదవులకు అర్హత లేదా ? సీఎంగా పనికిరారా ? అంటు వీర్రాజు అడగటమే పెద్ద జోక్. మొన్న బద్వేలు అసెంబ్లీ ఉపఎన్నికల్లో పోలింగ్ ఏజెంట్లకు కూడా పార్టీకి దిక్కులేకపోయింది. టీడీపీ నుండి కొందరిని అరువు తెచ్చుకుని పోలింగ్ ఏజెంట్లుగా కూర్చోబెట్టారనే ప్రచారం అందరికీ తెలిసిందే. కాబట్టి పదవులకు అర్హతలని కాకుండా జనబలం ఎంతమందికి ఉందని విశ్లేషించుకుంటే మంచింది.



మరింత సమాచారం తెలుసుకోండి: