షెడ్యూల్ ప్రకారమే ఉత్తరప్రదేశ్ ఎన్నికలు జరగటం ఖాయమైపోవటంతో బీజేపీలో పూర్వాంచల్ టెన్షన్ పెరిగిపోతోంది. నిజానికి పూర్వాంచల్ టెన్షన్ బీజేపీకన్నా నరేంద్రమోడీలోనే ఎక్కువగా ఉంది. ఉత్తరప్రదేశ్ లోని బాగా వెనుకబడిన ప్రాంతాల్లో పూర్వాంచల్ కూడా ఒకటి. ఈ ప్రాంతంలో విస్తారమైన వ్యవసాయ భూములున్నాయి. క్రిక్కిరిసిన జనాలున్నారు. పెద్ద పెద్ద పరిశ్రమలున్నాయి. అయినా అనేకరకాలుగా ఈ ప్రాంతం బాగా వెనకబడే ఉండటం ఆశ్చర్యమే.
వెనకబాటుకు ప్రధాన కారణం మత, కులాల ప్రాతిపదికగా భయకరమైన గ్యాంగులే. ఫ్యాక్షన్ రాజకీయాలు ఈ ప్రాంతంలో అభివృద్దిని దెబ్బతీస్తున్నాయి. ఈ ప్రాంతంలో 196 అసెంబ్లీ సీట్లున్నాయి. ఇపుడు ఈ ప్రాంతంలో పాగా వేయాలని బీజేపీ గట్టి ప్రయత్నాల్లో ఉంది. ఎందుకంటే ఇప్పటికే బీఎస్పీ, ఎస్పీలకు ఈ ప్రాంతంలో మంచి ప్రాబలమ్యుంది. ముస్లింలు, యాదవులు, ఎస్సీ సామాజికవర్గాల ఫ్యూడల్ రాజకీయాలకు బలమైన కేంద్రం ఈ ప్రాంతం.
ఇపుడీ ప్రాంతంపైన బీజేపీ ఎందుకు దృష్టి పెట్టిందంటే నరేంద్రమోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాశి పార్లమెంటు నియోజకవర్గంతో పాటు సీఎం యోగి నియోజకవర్గం గోరఖ్ పూర్ ఈ ప్రాంతంలో ఉన్నాయి కాబట్టే. మోడి, యోగి నియోజకర్గాలున్న ప్రాంతాల్లో బీజేపీ మెజారిటి సీట్లు సాధించలేకపోతే ఇంకేమన్నా ఉందా ? అందుకనే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పూర్వాంచల్ పై ప్రత్యేక దృష్టిపెట్టారు. ఇప్పటికే రెండుసార్లు టూర్ చేశారు. బీఎస్పీ, ఎస్పీ నాయకత్వాలను దెబ్బతీయటం ద్వారా వాటి ఓటుబ్యాంకును కొల్లగొట్టాలని షా చెప్పారు.
అయితే ముస్లిం, ఎస్సీ ఓటుబ్యాంకును కొల్లగొట్టడం బీజేపీ అనుకున్నంత సులభం కాదు. ఎందుకంటే ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ కూడా ఈ ప్రాంతంపై ప్రత్యేక దృష్టిపెట్టారు. బహుశా బీజేపీ ప్లాన్లను గ్రహించినట్లున్నారు. అందుకనే ఆప్ ఆధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తో కలిసి ఇప్పటికే టూర్ చేశారు. షెడ్యూల్ ఎన్నికలు వాయిదా పడితే తమ వ్యూహాలను అమలు చేయచ్చని బీజేపీ అగ్రనేతలు అనుకున్నారు.
అయితే ఎన్నికల వాయిదా కుదరదని తేలిపోవటంతో ఓటుబ్యాంకులను ఎలా దగ్గరకు తీసుకోవాలో అర్ధంకాక కమలనాదుల్లో టెన్షన్ పెరిగిపోతోంది. ఇదే విషయమై జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వస్తున్నారు. అలాగే మోడి కూడా ప్రత్యేకంగా పర్యటించబోతున్నారు. జరుగుతున్నది చూస్తుంటేనే మోడి అండ్ కో లో టెన్షన్ ఏ రేంజిలో పెరిగిపోతోందో అర్ధమైపోతోంది.