సీఎం వైఎస్ జగన్ సోమవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. ప్రధాని మోడీతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. జలవివాదాలు, పోలవరం సహా ఇతర ప్రాజెక్టులు, మూడు రాజధానుల బిల్లు, ఏపీకి రావాల్సిన బకాయిలు, విభజన చట్టంలోని అంశాలపై చర్చించే అవకాశముంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతోనూ సమావేశమవుతారు. ముందస్తు ఎన్నికలు, త్వరలో జరగబోయే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలపై చర్చ జరగనుందని సమాచారం.

అయితే తమ ప్రభుత్వానికి ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచనలేదని.. ఐదేళ్లూ పాలన కొనసాగిస్తామని వైఎస్సార్ సీపీ ఎంపీ మిథున్ రెడ్డి స్పష్టం చేశారు. టీడీపీని కాపాడుకునేందుకే ప్రతిపక్ష నేత చంద్రబాబు తరచూ ముందస్తు ఎన్నికల గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.

రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలపై చంద్రబాబు స్పందించారు. ముందస్తు ఎన్నికల ప్రచారం తాను విన్నాననీ.. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తాము సిద్ధమేనని ప్రకటించారు. సీఎం జగన్ వివిధ కంపెనీల విశ్వసనీయత, బ్రాండ్ ఇమేజ్ దెబ్బ తీశారని విమర్శించారు. ఒకప్పుడు భువనేశ్వర్ నుంచి విశాఖకు వలస వచ్చేవారనీ.. ఇప్పుడు రాష్ట్రం నుంచి భువనేశ్వర్ కు వలస వెళ్లే దుస్థితి వచ్చిందన్నారు.

సీఎం జగన్ అడిగిన ఒక్క అవకాశం ప్రజలిచ్చారనీ.. ఇప్పుడు భ్రమలు తొలగిపోయాయని టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఈ ప్రభుత్వంపై ప్రజల్లో తిరుగుబాటు స్పష్టంగా కనిపిస్తోందన్నారు. సంక్షేమం కింద ఇచ్చేదాని కంటే ప్రజలపై మోపే భారం మూడు రెట్లు ఎక్కువని విమర్శించారు. ఇక పనితీరు మెరుగుపడకుంటే పార్టీ నియోజకవర్గ ఇంఛార్జీలను మార్చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఎవరి కోసమూ పార్టీ త్యాగాలు చేయదని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే యూపీ అసెంబ్లీ ఎన్నికల వేళ నాయకులు ఉచిత హామీలు ప్రకటిస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే ఇళ్లకు 300యూనిట్ల వరకు విద్యుత్ ఫ్రీగా ఇస్తామని ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ హామీ ఇచ్చారు. అలాగే రైతులకు సైతం ఇరిగేషన్ కోసం ఉచితంగా విద్యుత్ ఇస్తామని చెప్పారు. అయితే గోవా, పంజాబ్ ఎన్నికల్లో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సైతం ఉచిత విద్యుత్ హామీ ఇచ్చారు.

 







మరింత సమాచారం తెలుసుకోండి: