తెలంగాణలో అధికార టీఆర్ఎస్‌ని దెబ్బతీయడమే లక్ష్యంగా ముందుకెళుతున్న బీజేపీ...కాంగ్రెస్ పార్టీకి కూడా చెక్ పెట్టడానికి వ్యూహాలు రచిస్తుందని తెలుస్తోంది. అసలు తెలంగాణలో బీజేపీకి పెద్దగా బలం లేదనే సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో ఆ పార్టీ 105 స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయి...కేవలం ఒక సీటు గెలుచుకుంది. అంటే తెలంగాణలో బీజేపీ పరిస్తితి ఏంటో అర్ధం చేసుకోవచ్చు. అలాంటి పార్టీ 2019 పార్లమెంట్ ఎన్నికల నుంచి పుంజుకోవడం మొదలైంది. ఆ ఎన్నికల్లో బీజేపీ తరుపున నలుగురు ఎంపీలు గెలవడంతో సీన్ మారిపోయింది.
ఇంకా అనూహ్యంగా బీజేపీ రేసులోకి వచ్చేసింది. రెండు ఉపఎన్నికల్లో గెలవడం, జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు చుక్కలు చూపించడంతో బీజేపీ దూకుడు ఏంటో తెలిసింది. ఇక ఇప్పుడు తెలంగాణలో టీఆర్ఎస్‌కు బీజేపీనే ప్రత్యామ్నాయం అన్నట్లు పరిస్తితి నడుస్తోంది. ఆ రెండు పార్టీల మధ్య ఎలాంటి వార్ నడుస్తుందో తెలిసిందే. ఆఖరికి బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ని జైల్లో పెట్టేవరకు సీన్ వెళ్లింది. జైలు నుంచి బయటకొచ్చిన సంజయ్ మరింత దూకుడుగా రాజకీయం చేయడం మొదలుపెట్టారు.
బీజేపీ నేతలంతా కలిసికట్టుగా టీఆర్ఎస్‌పై పోరాటం ఉదృతం చేశారు. నెక్స్ట్ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు చెక్ పెట్టి అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా ముందుకెళుతున్నారు. అయితే బీజేపీ అధికారంలోకి రావాలంటే టీఆర్ఎస్‌కు చెక్ పెడితే సరిపోదు...కాంగ్రెస్‌కు కూడా చెక్ పెట్టాలి. ఎందుకంటే బీజేపే కంటే కాంగ్రెస్ పార్టీ క్షేత్ర స్థాయిలో బలంగా ఉంది. ఆ పార్టీకి బలమైన నాయకత్వం ఉంది.
కాబట్టి కాంగ్రెస్‌ని కూడా వీక్ చేయాలి...అలాగే స్ట్రాంగ్‌గా ఉన్న పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని కూడా నిలువరించాలి. ఆయనకు రాజకీయంగా బలపడే అవకాశాలు ఏ మాత్రం ఇవ్వకూడదు. అంటే కాంగ్రెస్‌లో ఉన్న బలమైన నాయకులని బీజేపీ వైపు తిప్పుకోవాలి. అప్పుడే బీజేపీకి మరింత బలం వస్తుంది. కేవలం టీఆర్ఎస్‌పైనే ఫోకస్ పెట్టడం వల్ల బీజేపీకి అంతగా బెనిఫిట్ ఉండకపోవచ్చు..కాంగ్రెస్‌పై కూడా ఫోకస్ చేసి పనిచేయాలి.