కోవిడ్ అనంతరం దేశంలోని అనేక రాష్ట్రాలు అనేక ప్రతిపాదనలు చేశాయని, జీవోలు తెచ్చాయని, తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసిఆర్ గారు కూడా కోవిడ్ బాధితులకు దేశంలో ఎవరూ చేయని విధంగా చేయుత అందించినప్పటికీ కోవిడ్ వల్ల తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు, మిగిలిన అనాథలందరినీ చూసి మనసు చలించి, ఇక తెలంగాణ రాష్ట్రంలో అనాథలు అనేవారు ఉండకూడదనే వజ్రసంకల్పంతో పెద్ద కేబినెట్ సబ్ కమిటీ వేసి, దేశం గర్వించే విధంగా వారికోసం సమగ్ర చట్టం చేసేందుకు నివేదిక ఇవ్వాలన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అనాథలకు ప్రభుత్వం నుంచి వివిధ రూపాల్లో అన్ని విధాల సాయం అందుతోందని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖల ప్రత్యేక కార్యదర్శి, కమిటీ కన్వీనర్ శ్రీమతి దివ్య దేవరాజన్ తెలిపారు. రాష్ట్రంలో అనాథల కోసం నిర్వహిస్తున్న అనేక అనాథ ఆశ్రమాలు, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులతో సమావేశాలు నిర్వహించి, వారి సలహాలు, సూచనలు తీసుకున్నామని మంత్రులకు వివరించారు. అనాథల కోసం వచ్చిన ప్రతిపాదనల సమాహారాన్ని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేశారు.
అనాథల కోసం ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కొంతమంది పిల్లలను అడ్డుపెట్టుకుని మానవ అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని, వారితో సిగ్నళ్ల వద్ద బిక్షాటన చేస్తున్నారని, వీరిపై పిడి చట్టం పెట్టి భవిష్యత్ లో ఇంకెవరు ఇలా చేయకుండా ఉండేందుకు కఠిన చర్యలు తీసుకునే విధంగా రానున్న నూతన చట్టంలో నిబంధనలు రూపొందించాలని మంత్రులు సూచించారు. సిగ్నళ్ల వద్ద పిల్లలతో బిక్షాటన చేయించే వారిని గుర్తించి, వారికి ప్రభుత్వ హోమ్స్ లలో షెల్టర్ కల్పించేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని సూచించారు. అనాథలను ప్రభుత్వ బిడ్డలుగా గుర్తిస్తూ వారికి ప్రత్యేక స్మార్ట్ ఐడి కార్డులు ఇవ్వాలని, ఈ కార్డు ఉంటే ఇన్ కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ వంటి ఇతర సర్టిఫికేట్ లకు మినహాయింపు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ముస్లీంలలో అనాథలను చేరదీసే విధంగా యతీమ్ ఖానాలు నిర్వహిస్తున్నారని, వాటిని కూడా ప్రభుత్వ పరిధిలోకి తీసుకొచ్చి అన్ని విధాల వారికి వసతులు కల్పించి అండగా నిలబడాలన్నారు.