తొందరపాటుతోనో లేదా ఆవేశంతోనే తీసుకున్న నిర్ణయాలు వర్కవుట్ కావని అందరికీ తెలిసిందే. ఇపుడీ విషయం వైఎస్ షర్మిలకు బాగా అనుభవంలోకి వస్తున్నట్లుంది. ఆవేశంతో తెలంగాణాలో పార్టీ పెట్టేశారు. ఇపుడు దాన్ని ఎలా నడపాలో అర్ధంకాక నానా అవస్తలు పడుతున్నారు. నిజంగా షర్మిలను చూస్తే అయ్యో పాపం అనిపిస్తుంది. తెలంగాణాలో పార్టీ పెట్టాలని తీసుకున్న నిర్ణయం ఆవేశంతో తీసుకున్నదే కానీ ఆలోచనతో కాదని ఇపుడు అందరికీ అర్ధమవుతోంది.
మరి ఎవరి మీద కోపంతో తెలంగాణాలో పార్టీ పెట్టాలో ఆమెకే తెలియాలి. ఎందుకంటే దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ కూతురనే అర్హత తప్ప షర్మిలకు మరింకేమీ లేదు. వైఎస్సార్ వారసత్వంతో ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ఏపీలో బలంగా పాతుకుపోయున్నారు. పైగా ఇపుడు అధికారంలో కూడా ఉన్నారు. జగన్ కూడా వైఎస్సార్ వారసత్వంతోనే రాజకీయాల్లోకి ఎంటరైనా తర్వాత తన సామర్ధ్యాన్ని ప్రూవ్ చేసుకున్నారు. అయితే రాష్ట్ర విభజనతో పరిస్ధితులన్నీ తల్లకిందులైపోయాయి.
ఇక్కడే పార్టీ పెట్టడంలో షర్మిల అంచనాలు తప్పినట్లు స్పష్టంగా అర్ధమైపోతోంది. రాష్ట్ర విభజన తర్వాత తెలుగుదేశంపార్టీ ఎలా దెబ్బతినేసిందో అందరు చూశారు. పైగా వైఎస్ఆర్సీపీ కూడా తెలంగాణాలో దెబ్బతినేసింది. ప్రాంతీయపార్టి రెండు రాష్ట్రాల్లో నెగ్గుకు రావటం కష్టమనే చంద్రబాబు, జగన్ తెలంగాణాలో చాప చుట్టేశారు. తన కళ్ళముందే ఇన్ని విషయాలు జరిగినా షర్మిల ఏ ఉద్దేశ్యంతోనే తెలంగాణాలో పార్టీ పెట్టారో అర్ధం కావటంలేదు. చంద్రబాబు, జగన్ తెలంగాణాలో పార్టీలను ఎందుకు వదిలేశారు ? ఎందుకంటే వాళ్ళిద్దరిపైన సీమాంధ్ర నేతలనే ముద్ర ఉన్న కారణంగానే. మరి షర్మిల మాత్రం తెలంగాణా వ్యక్తని జనాలు ఎలా అనుకుంటారు ?
ఇక్కడే షర్మిల ఆవేశం, అనాలోచితం బయటపడుతోంది. పార్టీ పెట్టడం, దాన్ని జనాల్లోకి తీసుకెళ్ళటానికి షర్మిల పడుతున్న అవస్తలు చూస్తుంటే చంద్రబాబు, జగన్ కన్నా తెలివైనదని అనిపించటంలేదు. పార్టీ పెట్టినదగ్గర నుండి షర్మిల తప్ప జనాలకు తెలిసిన నేత మరొకరు లేరు. మొదట్లో ఉన్న నలుగురు కూడా ఇపుడు బయటకు వెళ్ళిపోయారు. ఇపుడున్న నేతల్లో ఎవరికీ జనాలతో సంబంధం లేదు. నిజంగానే షర్మిల తెలివైన వ్యక్తి అయ్యుంటే తెలంగాణాలో పార్టీ పెట్టేవారే కారు.