తెలంగాణలో కరోనా కల్లోలం రేపుతోంది. సింగరేణి వ్యాప్తంగా 913మంది కరోనా బారిన పడ్డారు. వీరిలో 382మంది ఉద్యోగులు, 415మంది కుటుంబ సభ్యులు, 116మంది ఔట్ సోర్సింగ్ సిబ్బంది ఉన్నారు. కరోనా సోకిన ఉద్యోగులకు వారం రోజులు ప్రత్యేక సెలవులు ఇస్తున్నట్టు సింగరేణి యాజమాన్యం తెలిపింది. గతంలో 14రోజుల సెలవులు ఇవ్వగా.. కేంద్రం తాజాగా సడలించిన మార్గదర్శకాల ప్రకారం ఏడు రోజులు సెలవు ఇస్తామంది. ఏడు రోజుల ఐసోలేషన్ తర్వాత విధుల్లోకి రావొచ్చంది.

అటు తెలంగాణ తాత్కాలిక సచివాలయంలో కరోనా కలకలం రేపింది. హైదరాబాద్ బీఆర్కే భవన్ లో కరోనా కేసులు నమోదవుతున్నాయి. సాధారణ పరిపాలన, విద్యాశాఖలతో సహా పలు విభాగాల్లో 15మందికి పైగా కరోనా సోకింది. ఐఏఎస్ అధికారి విద్యాశాఖ కార్యదర్శి సందీప్ సుల్తానీయకు కరోనా నిర్ధారణ అయింది. మరో సీనియర్ ఐఏఎస్ అధికారి, జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్ రాజా హోం ఐసోలేషన్ లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు.

ఇక తెలంగాణ పోలీస్ శాఖనూ కరోనా వణికిస్తోంది. హైదరాబాద్ సీసీఎస్, సైబర్ క్రైమ్ విభాగాల్లోని 20మందికి పాజిటివ్ రాగా నార్సింగి పీఎస్ లో 20మదికి వైరస్ సోకింది. జిల్లాల్లోనూ పలు పోలీస్ స్టేషన్ లలో సిబ్బంది కోవిడ్ బారిన పడినట్టు తెలుస్తోంది. ఫ్రంట్ లైన్ వారియర్లు అయిన పోలీసులు విధులకు దూరమైతే పరిస్థితులు అదుపుతప్పుతాయి. తప్పనిసరైన విధుల్లో ఉన్నవారు డ్యూటీ చేస్తూనే కోవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ తమను తాము కాపాడుకోవాలి.

ఇక తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ శ్రీనివాసరావు కరోనా బారిన పడ్డారు. స్వల్ప లక్షణాలు కనిపించాయనీ.. టెస్టులు చేయించుకోవడం ద్వారా కరోనా నిర్ధారణ అయినట్టు చెప్పారు. దీంతో ముందు జాగ్రత్తగా చికిత్స కోసం ఆస్పత్రిలో ఐసోలేషన్ లో ఉంటున్నా.. త్వరలో పూర్తిగా ప్రజల ముందుకొస్తున్నట్టు చెప్పారు. అందరూ కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.

మరోవైపు రానున్న రెండు రోజుల్లో కరోనా మరింత తీవ్ర రూపం దాల్చనుందని.. వచ్చే మూడు వారాలు చాలా కీలకమని ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. అందరూ మాస్కులు ధరించాలనీ.. కోవిడ్ లక్షణాలు ఉంటే ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లి డబ్బులు వృథా చేసుకోవద్దన్నారు. ఏఎన్ఎం సబ్ సెంటర్, పీహెచ్ సీ, ప్రభుత్వ దవాఖానాకు ఎక్కడికి వెళ్లినా మందులు ఇచ్చేందుకు..కోవిడ్ టెస్టులు చేసేందుకు వైద్య సిబ్బంది సిద్ధంగా ఉన్నారని హరీశ్ తెలిపారు.





మరింత సమాచారం తెలుసుకోండి: