ఆమధ్య సోము వీర్రాజు చీప్ లిక్కర్ గురించి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో కలకలం సృష్టించాయి. వైరి వర్గాలు సోమూని బాగానే టార్గెట్ చేశాయి. ఆ చీప్ లిక్కర్ ప్రభావాన్ని తట్టుకోడానికి వరుసగా వారం రోజులపాటు ప్రెస్ మీట్లు పెట్టి, అదీ ఇదీ చెప్పుకోవాల్సి వచ్చింది వీర్రాజు. కానీ ఆ టైమ్ లో పవన్ కల్యాణ్ కానీ, జనసేన కానీ స్పందించలేదు. మద్యపాన నిషేధంపై పదే పదే ప్రభుత్వాన్ని ప్రశ్నించే పవన్ కల్యాణ్.. సోము వీర్రాజు చీప్ లిక్కర్ వ్యాఖ్యలపై మాత్రం మౌనంగానే ఉన్నారు. తమ మిత్రపక్షం అధికారంలోకి వస్తే మద్యం రేట్లు తగ్గిస్తామని చెప్పినా పవన్ స్పందించలేదు. పోనీ మద్యం విషయంలో ఆయన ధోరణి అంతే అనుకుంటే పర్లేదు. కానీ ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పవన్ తప్పుబడుతూ స్టేట్ మెంట్ ఇచ్చే సరికి దొరికిపోయారు.
మద్యం అమ్మకాల సమయాన్ని రాత్రిపూట మరో గంటసేపు పెంచడాన్ని జనసేన తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఓవైపు కరోనాతో అన్నీ ఆపేస్తున్న దశలో మద్యం దుకాణాల సమయం ఎందుకు పెంచారంటూ పవన్ సోషల్ మీడియా వేదికగా ప్రెస్ నోట్ తో ప్రశ్నించారు. గంటసేపు టైమ్ పెంచితే ప్రశ్నిస్తున్న పవన్, చీప్ లిక్కర్ ని డెడ్ చీప్ గా ఇస్తామంటూ తమ మిత్రపక్షం నేత హామీ ఇస్తే మాత్రం దానిపై ఎందుకు స్పందించరంటూ విమర్శిస్తున్నారు నెటిజన్లు. అసలు మద్యపాన నిషేధానికి పవన్ అనుకూలమా, వ్యతిరేకమా చెప్పాలని అడుగుతున్నారు. నిజంగానే పవన్ మద్యపాన నిషేధానికి అనుకూలం అయితే, పదే పదే వైసీపీని ప్రశ్నించేది అందుకే అయితే.. అప్పుడు బీజేపీని కూడా ప్రశ్నించి ఉండాలి కదా అనేది నెటిజన్ల లాజిక్. అప్పట్లో సోము వ్యాఖ్యలు అటు బీజేపీనే కాదు, జనసేనని కూడా ఇరుకున పెట్టాయి. ఇప్పుడు బీజేపీ, జనసేన రెండూ.. వైన్ షాపుల టైమ్ టేబుల్ పొడిగింపుపై మండిపడుతున్నాయి.