రాజీనామానా ? లేకపోతే అనర్హత వేటా ? డెడ్ లైన్ దగ్గరకు వస్తుండటంతో వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణఏంరాజులో టెన్షన్ మొదలైనటయ్లుంది. ఎందుకంటే ఫిబ్రవరి 3వ తేదీలోగా ఈ విషయంపై క్లారిటి వచ్చేసేట్లే ఉంది. ఫిబ్రవరి 3వ తేదీన పార్లమెంటు ప్రివిలేజ్ కమిటి సమావేశం జరగబోతోంది. ఆ సమావేశంలోనే వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజుపై అనర్హత వేటు విషయం తేలిపోతుంది. తిరుగుబాటు ఎంపీపై అనర్హత వేటు వేయాలని వైసీపీ దాదాపు రెండేళ్ళుగా పెద్ద పోరాటమే చేస్తోంది.
అయితే కేంద్రంలోని పెద్దలతో తనకున్న సన్నిహితం కారణంగా ఇంతకాలం పార్టీ డిమాండ్ ను ఎంపీ అడ్డుకుంటున్నారు. అయితే పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈమధ్య నరేంద్రమోడిపై బాగా ఒత్తిడి చేశారట. దాంతో మోడీ కూడా లోక్ సభ స్పీకర్ కు ఆదేశాలిచ్చినట్లున్నారు. ఎందుకంటే ముందు ముందు జగన్ తో బీజేపీకి చాలా అవసరాలుంటాయి. రాష్ట్రపతి ఎన్నిక, ఐదురాష్ట్రాలఎన్నికల ఫలితాల తర్వాత కొత్త మిత్రులను చేర్చుకోవటం, రాజ్యసభలో వైసీపీకి పెరగబోతున్న బలం లాంటివి దృష్టిలో ఉంచుకునే మోడి కూడా జగన్ డిమాండ్ కు పచ్చజెండా ఊపినట్లున్నారు.
ఇందులో భాగంగానే రఘురాజుతో పాటు బెంగాల్ తృణమూల్ ఎంపీ శిశిర్ అధికారిపైన ఉన్న అనర్హత పిటీషన్లపై నిర్ణయం తీసుకోమని ప్రివిలేజ్ కమిటిని స్పీకర్ ఆదేశించారు. ఇదే విషయంపైన ప్రివిలేజ్ కమిటి ఫిబ్రవరి 3వ తేదీన సమావేశమవబోతోంది. ఆ సమావేశంలో ఎంపీలపై అనర్హత వేటు వేయాలని నిర్ణయమైతే అదే విషయాన్ని స్పీకర్ కు సిఫారసు చేస్తుంది. దాంతో ఎంపీపై వేటు ఖాయమవుతుంది. కాకపోతే అనర్హత వేటు ఏరోజు పడుతుందనేది స్పీకరే ప్రకటించాలి.
ఎంపీకి కేంద్రంలోని పెద్దలతో ఉన్న సంబంధాల కారణంగా విషయాన్ని ముందే తెలుసుకోవటం పెద్ద కష్టం కాకపోవచ్చు. అనర్హత వేటు ఖాయమని తేలితే దానికన్నా ముందే ఎంపీ రాజీనామా చేసేయటం ఖాయం. అనర్హత వేటు తప్పదని తేలిపోయిన తర్వాత తనంతట తానుగా రాజీనామా చేస్తేనే హుందాగా ఉంటుందని రాజుగారికి మాత్రం తెలీదా ? సో రాజీనామానా ? అనర్హత వేటా ? అనే విషయం తేలిపోవటానికి డెడ్ లైన్ దగ్గరపడుతున్నట్లే అనుకోవాలి.