గతంలో బంజారాహిల్స్‌లో చదరపు గజం ధర.. రిజిస్ట్రేషన్ రేటు ప్రకారం.. రూ.84,500 నుంచి ఏకంగా చదరపు గజానికి రూ.1,14,100కు పెంచేశారు. తెలంగాణ రాష్ట్రంలోనే ఇది అత్యధిక ధర. బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్ ఒకప్పుడు హైదరాబాద్ నగరానికి అవతల విసిరేసినట్టుగా కొండలు, గుట్టలుగా ఉండేవి.. సినిమా రంగం చెన్నై నుంచి హైదరాబాద్‌కు తరలి రావడం ఆ ప్రాంత అభివృద్ధిలో ఓ మేలు మలుపుగా చెప్పుకోవచ్చు.
సినీ రంగాన్ని హైదరాబాద్‌కు ఆకర్షించే ప్రక్రియలో భాగంగా అప్పట్లో జలగం వెంగళరావు, మర్రి చెన్నారెడ్డి తదితరులు సీఎంలుగా ఎంతో కృషి చేశారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్, బంజారాహిల్స్ ప్రాంతంలో సినిమా స్టూడియోలు కట్టుకునేందుకు ప్రభుత్వ భూమిని చౌకధరలకు కేటాయించారు. అన్నపూర్ణ స్టూడియో, పద్మాలయా స్టూడియో, రామానాయుడు స్టూడియో వంటివి అలా ఏర్పడినవే. అప్పట్లో చవగ్గా ఇవ్వడం కాదు.. ఉచితంగా ఇచ్చినా ఆ రాళ్లు, కొండలను ఏం చేసుకుంటారని అనేవాళ్లు.
అక్కినేని నాగేశ్వరరావు అన్నపూర్ణ స్టూడియో నిర్మాణం ప్రారంభించినప్పుడు డబ్బంతా రాళ్లలో పోసేస్తున్నాడని విమర్శిచినవాళ్లూ ఉన్నారు. ఇప్పుడు ఆ ప్రాంతంలో ప్రభుత్వ రేటు ప్రకారమే గజం లక్ష దాటింది. ఇక మార్కెట్ రేటు గురించి చెప్పాల్సిన పని లేదు. ఇదీ బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ రియల్ ఎస్టేట్ కథాకమామీషు. ఇక్కడ అపార్ట్‌మెంట్ మార్కెట్ ధర కూడా ఎస్‌ఎఫ్‌టీకి రూ.9500గా ప్రభుత్వం నిర్ణయించింది.