తెలుగు రాష్ట్రాలకు సంబంధించి విభిన్న పంథాలో రాజకీయం కొనసాగుతోంది.మోడీని పల్లెత్తు మాట కూడా అననీయని స్థితిలో జగన్ ఉంటే,అందుకు పూర్తి భిన్నంగా మరొకరు రాజకీయం చేస్తున్నారు.జగన్ కు విభిన్నంగా కేసీఆర్ తన దారి తాను వెతుక్కుంటున్నారు. బడ్జెట్ లో కేటాయింపులపై ఇంతవరకూ స్పందించని జగన్ కొన్ని విషయాల్లో ఇప్పటికీ బీజేపీకి మద్దతుగా నిలిచి స్వామిభక్తి చాటుకుంటున్నారు. కానీ తెలంగాణ రాష్ట్ర సమితి మాత్రం పూర్తిగా వ్యతిరేక గళం వినిపిస్తోంది. ఇప్పటికిప్పుడు ప్రత్యేక కూటమి ఏర్పాటుకు శక్తి చాలకపోయినా కూడా కేసీఆర్ మాట్లాడుతున్నారు. ఆయన గొంతుకకు బాసటగా కవిత నిలుస్తున్నారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం తీరును గణాంకాలతో సహా ఎండగట్టడమే కాకుండా వీరి వైఖరికి సమాఖ్య స్ఫూర్తికే విఘాతం అని చెబుతున్నారు.
తెలంగాణ జాగృతి అధినేత, కేసీఆర్ గారాలపట్టి కవిత ఇవాళ ట్విటర్ వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా ఆమె కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.అంతేకాకుండా తన తండ్రి, సోదరుడు బాటలోనే తాను కూడా అన్న సంకేతాలిస్తూ, మోడీ పై పోరుకు దారులను ఇంకాస్త సుగమం చేశారు. ముఖ్యంగా జాతీయ సంస్థలను అమ్మకానికి పెట్టడంపై ఫైర్ అయ్యారు. ఇక ఈ పోరు మరో రూపం ఎలా తీసుకోనుందో అన్నది ఆసక్తిదాయకంగా ఉంది.
తెలంగాణ ప్రభుత్వం తన పంథాను పూర్తిగా మార్చింది.బడ్జెట్ లో కేటాయింపులపై ఎటువంటి న్యాయం దక్కకపోవడంతో గులాబీ నేతలంతా మండిపడుతున్నారు.బడ్జెట్ ప్రసంగం వినగానే కేసీఆర్ తనదైన బాణీలో రెండు గంటలకు పైగా మీడియా ఎదుట మాట్లాడి కేంద్రాన్ని టార్గెట్ చేశారు.తరువాత కేటీఆర్ కూడా అదేవిధంగా అంతే స్థాయిలో గణాంక సహితంగా టార్గెట్ చేశారు. దీంతో వివాదం మరింత వేడెక్కింది.తాజాగా ఎమ్మెల్సీ కవిత కూడా సీన్లోకి వచ్చారు. రాష్ట్రం పూర్తిగా నష్టపోతున్న వైనంపై కేసీఆర్,కేటీఆర్ స్పందిస్తే ఎల్ఐసీకి సంబంధించి కవిత కొన్ని మాటలు చెప్పారు. ఎల్ఐసీకి మద్దతుగా నిలిచారు.లాభాల్లో ఉన్న జీవిత బీమా సంస్థను ఎందుకు అమ్ముతున్నారో తెలియజెప్పాలని పట్టుబట్టారు.దీంతో వివాదం ఇంకాస్త ముదిరింది.