ఆంధ్ర ప్రదేశ్ లో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ఆరంభం కావడంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయానికి మద్దతుగా ర్యాలీలు , పాలాభిషేకాలు ఇంకా కూడా జరుగుతున్నాయి. అదే సమయంలో కొన్ని కొన్ని చోట్ల నిరసనలు, అసంతృప్తులు రేగుతున్నాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ ఎం.ఎల్.ఏల మధ్య ఈ విషయమై గ్యాప్ పెరిగింది. ముఖ్యంగా ఇప్పటి వరకూ ఇద్దరు మిత్రులుగా చలామణి అవుతున్న శ్రీ కాళహస్తి ఎం.ఎల్.ఏ బియ్యపు మధుసూధన్ రెడ్డి, ఆ నియోజక వర్గానికి పక్కనే ఉన్న సూళ్లూరు పేట శాసన సభ్యుడు కిలివేటి సంజీవయ్యకు మధ్య గ్యాప్ పెరిగింది. ఇరువురూ తమ నియోజక వర్గాలలో డివిజన్ ఏర్పాటుకు పట్టుపడుతుండటంతో ఎంఎల్ఏలిద్దరూ ఢీ అంటే ఢీ అనే స్థితికి వచ్చారని పార్టీశ్రేణులు బాహాటంగానే చర్చించుకుంటున్నాయి.
ప్రజలకు అందుబాటులో ఉన్న సౌకర్యాలు, చారిత్రక ప్రాధాన్యం ఇత్యాది అంశాలనుకాదని వేరో చోట జిల్లా కేంద్రాలు, డివిజన్ కేంద్రాలు ఏర్పాటుకు సంబంధించిన ప్రకటన వెలువడంతో శ్రీ కాళహస్తి, సూళ్లూరు పేట శాసన సభ్యుల మధ్య గ్యాప్ పెరిగిందని పార్టీ శ్రేణులు బాహాటంగానే చర్చలు సాగుతున్నాయి. వాస్తవానికి ఇద్దరు కూడా గతంలో నుంచి మంచి మిత్రులు. శ్రీ కాళహస్తి నియోజక వర్గం నుంచి ఎం.ఎల్.ఏగా బియ్.పు మధు సూధన్ రెడ్డి రెెండు సార్లు పోటీ చేసి తోలిసారి ఓటమి పాలై రెండో దఫా విజయం సాధించారు. సూళ్లూరు పేట నియోజక వర్గం నుంచి సంజీవయ్య పోటీ చేసిన రెండు సార్లు కూడా విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం సంజీవయ్యకు ప్రతిష్ఠాత్మక మైన తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యుడుగా కూడా ఉన్నారు.
కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియలో శ్రీ బాలాజీ జిల్లాను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న నెల్లూరు, చిత్తూరు జిల్లాలను విడగొట్టి శ్రీ బాలాజీ జిల్లాను ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అంత వరకూ బాగానే ఉంది. ఈ విషయంలో అందరిలోనూ ఏకాభిప్రాయం ఏర్పడింది.
ఎటోచ్చీ డివిజన్ కేంద్రాల ఏర్పాటు పై నేతల్లో విబేధాలు నెలకొన్నాయి. ప్రభుత్వ ప్రకటనలో ఇప్పటికే ఉన్న మూడు రెవిన్యూ డివిజన్లు గూడూరు, నాయడుపేట, తిరుపతి అలాగే ఉంటాయని పేర్కోంది. తొలుత ఈ విషయం లో ఎలాంటి అభిప్రాయ బేధాలు తలెత్త లేదు. కానీ తరువాత, తరువాత కాలంలో విబేధాలు తలెత్తాయి. బియ్యపు మధుసూధన్ రెడ్డి శ్రీ కాళహస్తి లో నూతనంగా రెవిన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. శ్రీ కాళహస్తికి, ప్రస్తుతం రెవిన్యూ డివిజన్ గా ఉన్న నాయుడు పేట కు మధ్య దూరం కేవలం 30 కిలోమీటర్లు కూడాలేదని, శ్రీ కాళహస్తి డివిజన్ ఏర్పాటు పై డిమాండ్ ఏమిటని సూళ్లూరు పేట శాసన సభ్యుడు కిలివేటి సంజీవయ్య ఆక్షేపణ వెలిబుచ్చినట్లు సమాచారం. దీంతో ఇద్దరి మధ్య డివిజన్ ఏర్పాటు ప్రతిష్టాత్మకం అయింది. తాజాగా బియ్యపు మధుసూధన్ రెడ్డి, తిరుపతి పార్లమెంట్ సభ్యుడు గురుమూర్తితో కలసి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డికి వినతి పత్రం సమర్పించారు. శ్రీ కాళహస్తి డివిజన్ ఏర్పాటు చేయాలని, తన ఈ ఒక్క కోరికను మన్నించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దీంతో అదికార పార్టీ శాసన సభ్యుల మధ్య ఢీ అంటే ఢీ అనే వాతావరణం తారాస్థాయికి చేరిందని వైసిపి వర్గాలు పేర్కోంటున్నాయి.