బీఎస్పీ అధినేత్రి మాయావతి వ్యవహారంపై ఇపుడిలాగే చర్చించుకుంటున్నారు. ఒకపుడు పార్టీ చిహ్నమైన ఏనుగు లాగ బలోపేతంగా ఉండే పార్టీ ఇపుడు బాగా బక్కచిక్కిపోయింది. ఇందుకు మాయావతి అనుసరించిన వ్యూహాలు, వెళ్ళిన రాంగ్ రూటే కారణమని చెప్పుకుంటున్నారు. మాయావతి ప్రధాన ప్రత్యర్ధి బీజేపీ కాదు ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ మాత్రమే. అఖిలేష్ ను దెబ్బ కొట్టేందుకు ప్రతి ఎన్నికకు ఒకరితో చేతులు కలుపుతుండేది మాయావతి. దీంతో సొంతంగా ఎస్పీని దెబ్బ కొట్టేంత స్ధాయికి ఎదగలేకపోయింది.
నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా చేసినా ఎప్పుడూ వివాదాలు, అవినీతి ఆరోపణలే. దీనికితోడు ఇపుడేమైందో తెలీదు కానీ చాలా కాలంగా స్తబ్దుగా ఉండిపోయింది. ఒకవైపు ఎన్నికల్లో గెలుపు కోసం బీజేపీ, ఎస్పీలు చాలా జోరుగా రాజకీయాలు చేస్తున్నా మాయావతి మాత్రం ఎక్కడా కనబడలేదు. ఎన్నికలు దగ్గరకు వచ్చేసినా చివరకు షెడ్యూల్ ప్రకటించిన తర్వాత కూడా మాయావతి గొంతే వినబడలేదు. ఒకవైపు యూపీలో ప్రధానమంత్రి నరేంద్రమోడి, యోగితో పాటు అఖిలేష్ కూడా ఫుల్లుగా తిరిగేస్తున్న మాయావతి మాత్రం అడ్రస్సే కనబడలేదు.
దాంతో మాయావతి బీజేపీతో లోపాయికారీ ఒప్పందం చేసుకున్నారా అనే సందేహాలు పెరిగిపోయాయి. ఆ సందేహాలు నిజమే అని ఇపుడు అనిపిస్తోంది. ఎందుకంటే ముస్లింలు, యాదవలు, దళితుల్లో ఏరికోరి ఎస్పీ కూటమి అభ్యర్ధుల సామాజికవర్గాలనే పోటీలోకి దింపింది. ఓట్లు చీల్చి బీజేపీకి లబ్ది చేకూర్చేందుకే మాయావతి ఇలా చేస్తోందని జనాల్లో బీఎస్పీ అంటే బీజేపీకి బీ టీమ్ అనే ముద్రపడిపోయింది. దాంతో దళితులు, ముస్లింలు మాయావతిని వదిలేస్తున్నారట.
మాయావతి బలమంతా 22 శాతం దళితులే అన్న విషయం అందరికీ తెలిసిందే. అలాంటి దళితుల్లో కడా మెజారిటి సెక్షన్ 56 శాతమున్న జాతవులే. అలాంటిది మాయవతి సామాజికవర్గంకు చెందిన జాతవులే ఇపుడు దూరంగా వెళిపోయారు. జాతవుల్లో ఎక్కువమంది ఎస్పీ కూటమికే మద్దతుగా నిలబడుతున్నారట. మిగిలిన పాసీలు, కనౌజియా, దోబీ, కోఠీ, ధనుక, వాల్మీకిలు ఎవరిష్టం వచ్చిన పార్టీలకు మద్దతిస్తున్నారు. ఒకపుడు వీళ్లంతా మాయావతి వెంటే ఉండేవారు. దళితుల్లో అత్యధికులైన జాతవులే మాయావతిని వదిలేశారు కాబట్టే బీఎస్పీ కత క్లైమ్యాక్సుకు చేరుకుందని అర్ధమైపోతోంది. ఒక విధంగా మాయావతి రాజకీయంగా చేసుకున్న స్వయంకృతమనే చెప్పాలి. చివరకు ఏమవుతుందో చూద్దాం.