సమ్మక్క, సారక్క జాతరలో బంగారంగా భావించి బెల్లాన్ని అమ్మవార్లకు నైవేద్యంగా సమర్పిస్తుంటారు భక్తులు. ఇతర భక్తులు సమర్పించిన బంగారాన్ని ప్రసాదంగా ఇంటికి తెచ్చుకుంటారు. అయితే అమ్మవార్లకు బెల్లం ఒక్కటే కాకుండా వడి బియ్యం, చీర, పసుపు బట్టలు, తట్టలు, బుట్టలు, బోనాలు, పట్నాలు, చిలుకలు, ఎదురుకోళ్లు, మేకపోతులను కూడా భక్తులు మొక్కులుగా చెల్లించుకుంటారు.
బెల్లం, ఉప్పును ఆదివాసీలు విలువైన వస్తువులుగా చూస్తారు. వాటిని వారు తయారు చేయరు. ఇతర ప్రాంతాల నుంచి వస్తు మార్పిడి లేదా కొనుగోలు చేసి తెచ్చుకుంటారు. అందుకే గిరిజనులు తమకు అత్యంత విలువైన బెల్లాన్ని బంగారంగా భావించి రెండేళ్లకు ఒక్కసారిగా జరిగే మేడారం జాతరలో తమ ఇష్టదైవాలైన సమ్మక్కసారక్కలకు సమర్పిస్తుంటారు. అదే సంప్రదాయాన్ని మిగతా భక్తులు కూడా పాటిస్తున్నారు.
ఇక సమ్మక్క-సారలమ్మల సన్నిధికి సమ్మక్క భర్త పడిగిద్దరాజు బయల్దేరారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా-యాపలగడ్డ గ్రాానికి చెందిన ఆరెం వంశీయులు పడిగిద్దరాజుతో కలిసి కాలినడకన మేడారం పయనమయ్యారు. రేపు రాత్రి 9గంటల లోపు మేడారం చేరుకుంటారు. పడిగిద్దరాజు రాకతో జాతర మొదలవుతుంది. ఎల్లుండి పడిగిద్దరాజు-సమ్మక్కకు పెండి తంతును వడ్డెలు నిర్వహిస్తారు.
ఇక ఈ సారి కూడా మేడారం జాతరలో హెలికాప్టర్ సేవలు అందుబాటులో ఉండనున్నాయి. జాతర ఏరియల్ వ్యూ రైడ్ కోసం ఒక్కొక్కరికి 3వేల 700రూపాయలుగా నిర్ణయించినట్టు బెంగళూరుకు చెందిన హెలీరైడ్ సంస్థ పేర్కొంది. హనుమకొండ ఆర్ట్స్ కాలేజీ నుంచి మేడారం జాతరకు వెళ్లాలనుకునే వారు ఒక్కొక్కరు 19వేల 999 చెల్లించాలి. బుకింగ్ కోసం 9400399999, 9880505905 ను సంప్రదించవచ్చు.