యుద్ధంతో అల్లాడుతున్న ఉక్రెయిన్ కు సాయం చేసేందుకు భారత్ ముందుకొచ్చింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానం ద్వారా టెంట్లు, బ్లాంకెట్లు, ఇతర సామాగ్రి పంపించింది. ఈ విమానం రొమేనియాకు చేరుకొని.. వీటిని అందించి.. తిరుగు ప్రయాణంలో సరిహద్దుల్లో చిక్కుకుపోయిన భారత విద్యార్థులను తీసుకురానుంది. ఈ ఉదయం నాలుగు గంటలకు ఒక యుద్ధ విమానం బయల్దేరింది. మరిన్ని విమానాలు బయల్దేరేందుకు రెడీగా ఉన్నాయి.

ఇక ఉక్రెయిన్ నుంచి భారతీయుల తరలింపు కొనసాగుతోందని కేంద్రం తెలిపింది. ఆ దేశ రాజధాని కీవ్ లో ఒక్క భారతీయుడు కూడా లేడనీ.. అందరినీ అక్కడి నుంచి తీసుకొచ్చామని విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్ చెప్పారు. ఇక రెండో అతిపెద్ద నగరమైన ఖార్కివ్ నుంచి ఇప్పటి వరకు 12వేల మందిని ఇండియాకు తీసుకొచ్చామని పేర్కొన్నారు. ఉక్రెయిన్ నుంచి ఇంకా 1377 మంది భారతీయులను తీసుకురావాల్సి ఉందని వివరించారు.

నెటిజన్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని టార్గెట్ చేస్తున్నారు. ఉక్రెయిన్ లో యుద్ధం ప్రారంభం కాకముందే.. అమెరికా, యుకేలు తమ పౌరులను తరలించాయనీ.. మోడీ ఆ పని ఎందుకు చేయలేకపోయారని ప్రశ్నించారు. యుద్ధానికి నాలుగు రోజుల ముందు ఇండియాకు రావాలని ప్రకటించారని.. ఇప్పటికే విమాన టికెట్లు భారీగా పెరిగాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మోడీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇక ఉక్రెయిన్ లో సంక్షోభంపై ఈ నెల 7, 8న అంతర్జాతీయ న్యాయస్థానం విచారణ చేపట్టనుంది. తమ దేశంపై రష్యా మారణహోమానికి పాల్పడిందంటూ ఉక్రెయిన్ ఐసీజేను ఆశ్రయించింది. దాడులకు రష్యాను బాధ్యులను చేయాలని కోరింది. దీంతో బహిరంగ విచారణ నిర్వహించనున్నట్టు ఐసీజే తెలిపింది. వారం రోజుల్లోనే విచారణ ప్రారంభం అవుతుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్ స్కీ ఆశాభావం వ్యక్తం చేశారు.

మరోవైపు రష్యాను ఒంటరి చేసేందుకు అమెరికా, నాటో సభ్య దేశాలు ఏకమవుతున్నాయి. తాజాగా రష్యా విమానాలు రాకుండా అమెరికా గగనతలంపై నిషేధం విధించింది. రష్యాలో అన్ని రకాల ఉత్పత్తుల విక్రయాలను ఆపేశామని యాపిల్ కంపెనీ వెల్లడించింది. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభం అయ్యాక రష్యా కరెన్సీ రూబుల్ విలువ దారుణంగా పడిపోయింది. ఫారెక్స్ మార్కెట్లో తొలిసారి అమెరికా డాలర్ విలువ రూబుల్ ను అధిగమించింది.







మరింత సమాచారం తెలుసుకోండి: