ఉక్రెయిన్ తో 11 రోజులుగా యుద్ధం చేస్తున్న రష్యా తన సైన్యాన్ని కీవ్ రాజధానికి సుమారు 45 కిలోమీటర్ల దూరంలో అట్టేపెట్టేసింది. అలాగే మరికొన్ని కీలక నగరాలకు సమీపంలో క్యాంపు వేయించింది. గడచిన వారంరోజులుగా రష్యా సైన్యాలు చాలా నింపాదిగా కదులుతున్నాయి. మామూలుగా అయితే ఒకరోజులో కీవ్ తో పాటు మరికొన్ని నగరాల్లోకి ప్రవేశించటం, బాంబుదాడులతో హడలుగొట్టేసుండవచ్చు.
కానీ రష్యా దళాలు ఆపని చేయకుండా చాలా రెస్టు తీసుకుంటున్నాయి. రష్యా సైన్యం ఇలా ఎందుకు చేస్తోందో ముందుగా ఎవరికీ అర్ధంకాలేదు. కానీ రోజులు గడిచిన కొద్దీ రష్యా అసలు వ్యూహాలు బయటపడుతున్నాయి. కీవ్ తో పాటు కీలకమైన నౌకాశ్రయ నగరాలైన మరియాపోల్, ఒడెస్సా రేవు నగరాలపైన రష్యా దృష్టిపెట్టింది. ముందుగా పై నగరాలను అన్నీవైపుల నుండి చుట్టుముట్టేసింది. నగరానికి బయటప్రాంతాల నుండి రాకపోకలు బంద్ చేసేసింది.
మరియాపోల్, ఒడెస్సా నౌకాశ్రయ నగరాలు ఉక్రెయిన్కు అంత్యంత ప్రాధన్యతున్న నగరాలు. నల్లసముద్రం తీరంలోని ఒడెస్సా తీరప్రాంతం నుండే పశ్చిమదేశాలతో ఉక్రెయిన్ వ్యాపారాలు చేస్తుంటుంది. ఈ ప్రాంతాన్ని గనుక రష్యా ఆధీనంలోకి తీసుకుంటే నల్లసముద్రంపై ఉక్రెయిన్ ఆధిపత్యం కోల్పోయినట్లే. అంటే బయటదేశాల నుండి ఉక్రెయిన్ కు వచ్చే సరుకునంతా రష్యా స్వాదీనం చేసేసుకుంటుంది. సైనికచర్య ద్వారా మరియాపోల్, ఒడెస్సా నౌకాశ్రయ నగరాలను స్వాధీనం చేసుకునే కన్నా వ్యూహాత్మకంగా వ్యవహరించి ఎక్కువ నష్టం జరగకుండా స్వాధీనంలోకి తీసుకోవాలన్నది రష్యా ఆలోచన.
అలాగే రాజధాని కీవ్ కు 45 కిటోమీటర్ల దూరంలో భారీ యుద్ధట్యాంకులను మోహరించి హ్యాపీగా రెస్టు తీసుకోవటానికి రష్యా సైన్యమేమీ హాలిడే టూరుకు ఉక్రెయిన్ కు చేరుకోలేదు. ఇక్కడ కూడా కీవ్ ను అన్నీవైపులనుండి బంధించేసింది. ఏదోరూపంలో స్వాధీనం చేసుకోవాలని అనుకునుంటే ఎప్పుడో బాంబులు కురిపించేసి నగరాన్ని నేలమట్టం చేసుండేదే. కానీ చాలా నింపాదిగా, ఒక వ్యూహం ప్రకారం సైన్యం కదులుతోంది. అందుకనే నగరాలను స్వాదీనం చేసుకునేందుకు ఇంత సమయం పడుతోంది.