మాజీ మంత్రి, టీడీపీ ఆళ్ళగడ్డ ఇన్చార్జి భూమా అఖిలప్రియ గురించి అందరు ఇలాగే అనుకుంటున్నారు. విషయం ఏమిటంటే ఆళ్ళగడ్డ భూమా కుటుంబంలో పెద్దఎత్తున గొడవలు జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి దంపతులకు భూమా అఖిలప్రియ, మౌనిక, జగద్విఖ్యాతరెడ్డి సంతానం. వీరిలో అఖిల టీడీపీలో ఉన్నారు. వీరికి మరో కజిన్ భూమా బ్రహ్మానందరెడ్డి కూడా ఉన్నారు. నంద్యాల ఎంఎల్ఏగా పనిచేశారు.





నాగిరెడ్డికి ఇద్దరు సోదరులున్నారు. వీరిలో ఒక సోదరుడి కొడుకు భూమా కిషోర్ కుమార్ రెడ్డి. ఈయన బీజేపీ నేతగా ఆళ్ళగడ్డలో చాలా యాక్టివ్ గా ఉన్నాడు. అంటే అఖిలకు ప్రత్యర్ధన్నమాట. రాజకీయంగానే కాకుండా ఏ విధంగా చూసినా అఖిల-కిషోర్ కు పడటంలేదు. అందుకనే ఎవరి రాజకీయాలు వాళ్ళు చేసుకుంటున్నారు. అఖిలేమో కేసుల మీద కేసుల్లో కూరుకుపోయి నియోజకవర్గానికి, క్యాడర్ కు దూరమైపోతున్నారు. కేసులు తదితరాల కారణంగా నేతలు, క్యాడరంతా అఖిలకు దూరమైపోయారు. 





ఇదే సమయంలో కిషోర్ బీజేపీ నేతగా దూసుకుపోతున్నారు. ఈ నేపధ్యంలోనే శనివారం భూమా నాగిరెడ్డి వర్ధంతి జరిగింది. ఈ సందర్భంగా తన చిన్నాన్న నాగిరెడ్డి దంపతుల విగ్రహాలను కిషోర్ తయారుచేయించారు. తన సొంత స్ధలంలోనే వాటిని ఏర్పాటు చేశారు. శనివారం వర్ధంతి సందర్భంగా ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. అఖిల+మిగిలిన ఇద్దరిని తప్ప మిగిలిన బంధువులను, మద్దతుదారులందరినీ కార్యక్రమానికి ఆహ్వానించారు.





ఈ విషయం తెలిసిన వెంటనే శనివారం ఉదయం కార్యక్రమం మొదలు కావటానికి ముందే అఖిల, ఆమె సోదరుడు విఖ్యాతరెడ్డి తమ మద్దతుదారులతో వచ్చి  విగ్రహాలను ఆవిష్కరించేసి పాలాభిషేకం చేసి వెళ్ళిపోయారు. విషయం తెలిసిన కిషోర్ తో పాటు మిగిలిన బంధువులు, మద్దతుదారులు అఖిలపైన మండిపోతున్నారు. ఇక్కడ గమనించాల్సిందేమంటే తన సొంతడబ్బులతో, తన సొంతస్ధలంలో ఏర్పాటుచేసిన  విగ్రాహాలను కిషోర్ కు చెప్పకుండా దొంగతనంగా వచ్చి ఆవిష్కరించేసి పాలాభిషేకం చేసి వెళ్ళిపోయారు. దీంతో అఖిలలో ఇంత శాడిజముందా అని అందరు ఆశ్చర్యపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: