పోచంపల్లి నుంచి మహారాష్ట్రలోని వార్ధా వరకు ఈ పాదయాత్ర జరుగుతుంది. తెలంగాణలో మొత్తం 26 రోజుల పాటు.. 1600 కి.మీ.లో ఈ పాదయత్ర జరుగుతుంది. కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ కూడా ఈ యాత్రలో ఒకరోజు పాల్గొనే అవకాశం ఉంది. ఇవాళ జరిగే పాదయాత్ర ప్రారంభ కార్యక్రమంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాల్గొంటారు. ఇదే యాత్రలో శనివారం పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా పాల్గొంటారు. ఆ తర్వాత వచ్చే ఆదివారం ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ పాదయాత్రలో పాల్గొంటారు.
ఈ పాదయాత్ర నేపథ్యంలో ప్రారంభం ఏర్పాట్లను కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ పరిశీలించారు. ఆయన భూదాన్ పోచంపల్లిలో పర్యటించిన పాదయాత్ర ఏర్పాట్ల గురించి అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ వెంట యాదాద్రి భువనగిరి డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి కూడా ఉన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే పాదయాత్రల సంస్కృతి పెరిగింది.
ఇప్పటికే వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల పాదయాత్ర చేస్తూనే ఉన్నారు. మరోవైపు బీఎస్పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా పాదయాత్ర చేస్తున్నారు. గతంలో రేవంత్ రెడ్డి కూడా ఓసారి పాదయాత్ర చేశారు. అయితే.. ఈ పాదయాత్ర రాజకీయ యాత్ర కాకపోవడం కొంత ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. ఏదేమైనా ఈ ఎండాకాలంలో యాత్రలు చేయాలంటే చాలా ఓపిక అవసరం.