ఉక్రెయిన్ లో మరో 30రోజుల పాటు మార్షల్ లా పొడిగించేలా అధ్యక్షుడు జెలెన్ స్కీ పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టారు. దీని ప్రకారం 18 నుంచి 60ఏళ్ల లోపు ఆరోగ్యంగా ఉన్న పురుషులు ఉక్రెయిన్ వదిలి వెళ్లేందుకు అనుమతి లేదనిప్రకటించారు. రష్యా దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో మానవ వనరుల కొరత రాకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఇక రష్యా సైనిక చర్య ప్రారంభమయ్యాక ఇప్పటి వరకు ఉక్రెయిన్ నుంచి సుమారు 30లక్షల మంది ప్రజలు వలస వెళ్లిపోయారని అంతర్జాతీయ వలస సంస్థ వెల్లడించింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అక్కడ మరో భారీ శరణార్థుల సంక్షోభం తలెత్తిందని పేర్కొంది. ఉక్రెయిన్ నుంచి 3లక్షల మంది పశ్చిమ ఐరోపాకు వలస వెళ్లగా.. ఏకంగా 18లక్షల మంది ఒక్క పోలండ్ కే తరలి వెళ్లారని పేర్కొంది.

ఇక ఉక్రెయిన్ రాజధాని కీవ్ పై పట్టు సాధించేందుకు రష్యా బలగాలు భీకర దాడులకు పాల్పడుతున్నాయి. కీవ్ నగరంలో పెద్దపెద్ద భవంతులే లక్ష్యంగా దాడులకు దిగుతున్నాయి. ఈ ఉదయం షెవ్చెంకో ప్రాంతంలో 12అంతస్తుల భవనంపై రష్యా సేనలు దాడులు చేశాయి. ఈ దాడిలో భవనంతో పాటు పక్కనే ఉన్ మరో 9అంతస్తుల భవనం కూడా దెబ్బ తిన్నట్టు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో పలువురు పౌరులకు గాయాలైనట్టు అధికారులు తెలిపారు.

రష్యా దాడులతో ఉక్రెయిన్ విలవిల్లాడుతోంది. ముఖ్యంగా మేరియుపోల్ నగరంలో పరిస్థితులు దారుణంగా మారాయి. అక్కడ దాదాపు 2వేల 500మంది మరణించారని.. శవాలు పేరుకుపోయాయని ఉక్రెయిన్ అధ్యక్షుడి సలహాదారు ఒలెక్సీ వెల్లడించారు. మేరియుపోల్ కు చేరుకునే మానవతా సాయాన్ని కూడా రష్యా అడ్డుకుంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. గడిచిన రెండు రోజుల్లోనే మరణాల సంఖ్య భారీగా పెరిగిందని చెప్పారు.

గత మూడు వారాలుగా రష్యా సేనలు జరుపుతున్న దాడులను తమ బలగాలు సమర్థవంతంగా తిప్పి కొడుతున్నాయని ఉక్రెయిన్ ప్రకటించింది. ఇప్పటి వరకు 13వేల 800 మందికి పైగా రష్యా సైనికుల్ని అంతం చేసినట్టు ఉక్రెయిన్ సైన్యం వెల్లడించింది. దీంతో పాటు 84విమానాలు, 108 హెలికాప్టర్లు, 430యుద్ధ ట్యాంకులు, 13వందల 75 సాయుధ శకటాలు, 819 వాహనాలు, 60ఇంధన ట్యాంకులను ధ్వంసం చేసినట్టు తెలిపింది.



మరింత సమాచారం తెలుసుకోండి: