మరోవైపు నెలరోజులుగా దాడులు చేస్తోన్న రష్యాకు ఉక్రెయిన్ ధీటుగా సమాధానం ఇస్తోంది. రష్యా వద్ద ఆయుధాలు తగ్గిపోవడమే కాకుండా సైనికులు నిరాశలో కూరుకుపోతున్నారు. దీంతో మిత్ర దేశం బెలారస్ ను ప్రత్యక్షంగా యుద్ధంలోకి దించాలని పుతిన్ భావిస్తున్నారు. ఇప్పటికే ఉక్రెయిన్ రాజధాని కీవ్ నుంచి తన రాయభార కార్యాలయాన్ని బెలారస్ ఖాళీ చేసింది. యుద్ధానికి దాదాపు 15వేల మంది సైనికులను బెలారస్ పంపనుందని ఉక్రెయిన్ అంచనా వేస్తోంది.
ఇక అత్యాధునిక టి-72బి3 యుద్ధ ట్యాంకుతో సహా ఓ రష్యా సైనికుడు ఉక్రెయిన్ కు లొంగిపోయాడు. తాము చేస్తోంది అర్థం లేని యుద్ధమనీ.. ఆ సైనికుడు అన్నట్టు ఉక్రెయిన్ మంత్రి విక్టర్ ఆండ్రుసివ్ చెప్పారు. రష్యా సైనికులు నైతికంగా చాలా దెబ్బతిని ఉన్నారనీ.. తినడానికి తిండి కూడా దొరకడం లేదని అతను తెలిపాడు. లొంగిపోయిన సైనికుడికి 7వేల 500 పౌండ్ల రివార్డుతో పాటు ఉక్రెయిన్ వారసత్వం కూడా కల్పించనున్నారు.
ఉక్రెయిన్ పై రష్యా యుద్ధ ప్రభావం కేవలం ఆ రెండు దేశాలకే పరిమితం కాదని ప్రపంచ వాణిజ్య సంస్థ పేర్కొంది. పేద దేశాల్లో ఆహారం కోసం అల్లర్లు జరిగే అవకాశముందని హెచ్చరించింది. ఆ యుద్ధం ఇలానే కొనసాగితే పేద దేశాలలో ఈ ఏడాది ఆహార సంక్షోభం ఏర్పడే అవకాశాలున్నాయని తెలిపింది. నల్ల సముద్ర దేశాలపై ఆధారపడుతున్న ఆఫ్రికా దేశాలపై ఈ ప్రభావం స్పష్టంగా ఉంటుందని వెల్లడించింది.
ఇక టర్కీలోని ఇస్తాంబుల్ వేదికగా రష్యా, ఉక్రెయిన్ ప్రతినిధుల మధ్య మంగళవారం శాంతి చర్చలు జరగనున్నాయి. ఈ రోజే చర్చలు జరగాల్సి ఉన్నా.. సాధ్యం కాలేదు. నిన్న రష్యా, టర్కీ అధ్యక్షులు పుతిన్, ఎర్డోగాన్ ల మధ్య జరిగిన సంభాషణలో భాగంగా ఇస్తాంబుల్ లో చర్చలకు పుతిన్ అంగీకరించారు. ఈ క్రమంలో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరే అవకాశముందని టర్కీ ఆశిస్తోంది. ఇప్పటికే రష్యా- ఉక్రెయిన్ ల మధ్య పలు దఫాలు చర్చలు జరిగినా పురోగతి లేదు.