జేసీ బ్రదర్స్ ది అధికారంలో ఉన్నా ఒకటే వరస ప్రతిపక్షంలో ఉన్నా ఒకటే వరస. అదేమిటంటే పార్టీలో చిచ్చుపెట్టడమే. ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతారు, మొహమాటం లేకుండా కుండబద్దలు కొట్టినట్లు చెప్పేస్తారనే ముసుగుంది. ఈ ముసుగులో జేసీ బ్రదర్సిద్దరు చంద్రబాబునాయుడు దగ్గరో లేకపోతే పార్టీ అంతర్గతంగా మాట్లాడుకోవాల్సినవి మీడియాతోనే చెప్పేస్తుంటారు. దీంతో పార్టీలో బ్రదర్స్ చిచ్చు మామూలుగా ఉండటంలేదు.





తాజాగా జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతు జిల్లాలోని 11 మంది మాజీ ఎంఎల్ఏలకు టికెట్లిస్తే అందరు ఓడిపోతారని పెద్ద బాంబు పేల్చారు. పైగా పుట్టపర్తిలో పల్లె రఘునాధరెడ్డికి అసలు టికెట్టే ఇవ్వద్దని చంద్రబాబుకు విజ్ఞప్తిచేశారు. ఇక్కడ విషయం ఏమిటంటే జేసీ బ్రదర్స్ కు మాజీ మంత్రులు, మాజీ ఎంఎల్ఏలతో అంటే కనీసం ఎనిమిదిమందితో ఏమాత్రం పడదు. వీళ్ళమధ్య పచ్చగడ్డి వేయకుండానే భగ్గుమంటుంది.





జిల్లాలోని 14 నియోజకవర్గాల్లోను జేసీల ప్రాబల్యం ఉండటంతో వీళ్ళని మిగిలిన నేతలు ఏమీ చేయలేకపోతున్నారు. అలాగని వీళ్ళ ఆధిపత్యాన్ని అంగీకరించలేకపోతున్నారు. ఈ కారణంగానే మిగిలిన నేతలకు జేసీ బ్రదర్స్ కు ఎప్పుడూ గొడవలే. అధికారంలో ఉన్నపుడు జరిగిన గొడవలే ఇపుడు ప్రతిపక్షంలో కూడా కంటిన్యు అవుతోంది. ఇదే పద్దతి కంటిన్యు అయితే వచ్చే ఎన్నికల్లో కూడా అంతర్గత కుమ్ములాటలతోనే టీడీపీ ఘోరంగా దెబ్బతినటం ఖాయం. వీళ్ళతో గొడవలు పెట్టుకుంటే ఏమవుతుందో చంద్రబాబుతో పాటు అందరికీ బాగా తెలుసు. 





11 మంది మాజీ ఎంఎల్ఏలు గెలిచే అవకాశమే లేదని చెప్పటంతో వాళ్ళంతా మండిపోతున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డికి కౌంటర్ గా పల్లె కూడా ఆరోపణలు చేశారు. మిగిలిన వాళ్ళు కూడా వరసబెడతారు. దీంతో గొడవలు ఇంకా పెద్దదైపోతుంది. మొత్తానికి టీడీపీలో జేసీల చిచ్చు మామూలుగా ఉండటంలేదు. వీళ్ళని వదిలించుకోలేరు అలాగని భరించనూ లేరు. ఎంతకాలం ఇలా వీళ్ళ చిచ్చును భరించాలో నేతలకు అర్ధం కావటంలేదు. అందుకనే నేతల ప్రశ్నలకు 2024 ఎన్నికలే సమాధానం ఇస్తాయని అనుకుంటున్నారు. అప్పుడేమవుతుందో చూడాల్సిందే.



మరింత సమాచారం తెలుసుకోండి: