కరోనా ప్రపంచానికే ఓ పీడకల.. ఆ పీడకల నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాం. అయితే కరోనా ఫస్ట్ వేవ్‌ కంటే.. సెకండ్ వేవ్‌ ఇండియాను చాలా ఇబ్బంది పెట్టింది. ఫస్ట్ వేవ్‌ను సునాయాసంగానే అధిగమించి.. టీకాలు ఉత్పత్తి చేసి.. ఇతర దేశాలకు కూడా పంపిన తర్వాత వచ్చిన సెకండ్ వేవ్‌ ఇండియాను వణికించేసింది. జనం పిట్టల్లా రాలిపోయారు. ప్రభుత్వం కూడా విమర్శల పాలైంది. స్మశానాలు సరిపోని దుస్థితి నెలకొంది. ఏ సోషల్ మీడియా చూసినా రిప్ సందేశాలే కనిపించేవి.


ఆ తర్వాత థర్డ్ వేవ్ కూడా పెద్దగా ఇబ్బంది పెట్టలేదు. అయితే ఓవరాల్‌ గా చూస్తే.. ప్రపంచ వ్యాప్తంగా కరోనా తక్కువ మరణాలు నమోదైన పెద్ద దేశాల్లో ఇండియానే ఫస్ట్ గా ఉందట. ప్రతి పదిలక్షల జనాభాకు ఇండియాలో కేవలం 374 మంది మాత్రమే మృతి చెందారని కేంద్ర ఆరోగ్యశాఖ
ప్రకటించింది. ఈ లెక్కలు చూస్తే.. వైరస్‌ తీవ్రత అధికంగా ఉన్న అమెరికా, బ్రెజిల్‌, రష్యా, మెక్సికో దేశాల కంటే ఇండియాలోనే కరోనా మరణాలు తక్కువ అన్నమాట. ఆయా దేశాలతో  పోలిస్తే కొవిడ్‌ మరణాల రేటు భారత్‌లోనే తక్కువని కేంద్రం చెప్పుకుంటోంది.


ఇండియాలో కొవిడ్‌ మరణాలు అధికంగా ఉన్నాయంటూ వస్తోన్న వార్తలపై రాజ్యసభలో కేంద్రం ఇలా వివరణ ఇచ్చింది. సభ్యులు అడిగిన ప్రశ్నకు  ఆరోగ్యశాఖ లిఖిత పూర్వకంగా ఇచ్చిన సమాధానంలో ఈ గణాంకాలు తెలిపింది. ఈ లెక్కలు మేం చెప్పినవి కావు.. ప్రపంచ ఆరోగ్య సంస్థే చెప్పిందని కేంద్రం చెబుతోంది. WHO గణాంకాల ప్రకారం మిలియన్ అంటే ప్రతి పదిలక్షల మందికి 374 మరణాలు అంటే చాలా తక్కువగా మరణాలు  చోటుచేసుకున్న దేశాల్లో భారత్‌ ఒకటిగా నిలిచిందట.


ఇదే సమయంలో అమెరికాలో ఈ సంఖ్య ప్రతి పదిలక్షల మందికి 2920 మరణాలు, బ్రెజిల్‌లో 3092, రష్యాలో 2506, మెక్సికోలో 2498 మరణాలు నమోదు అయ్యాయట. ఆయా దేశాలతో పోలిస్తే భారత్‌లో కొవిడ్‌ మరణాల రేటు చాలా తక్కువ అని కేంద్రం చెప్పుకుంటోంది. అంతే కాదు. కొవిడ్‌ మరణాలు అధికంగా చోటుచేసుకున్నాయంటూ వచ్చిన నివేదికలకు ప్రామాణికత లేదని.. వాటికి విశ్వసనీయత లేదని కేంద్రం చెబుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: