ఇపుడీ విషయంపైనే రాజకీయవర్గాల్లో ప్రధానంగా కాంగ్రెస్ లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ ఏడాది చివరలో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. గుజరాత్ లో గడచిన 20 ఏళ్ళుగా కాంగ్రెస్ ప్రతిపక్షానికే పరిమితమైపోయుంది. ఈ రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే బాధ్యతను అధిష్టానం రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే)కి అప్పగించింది. పీకే కూడా వెంటనే రంగంలోకి దిగేసి వ్యూహాలకు పదునుపెట్టేశారు. ఈ విషయంపైనే చర్చ మొదలైంది.





పీకే చేసిన మొదటిపని ఏమిటంటే నరేష్ పటేల్ ను కాంగ్రెస్ లోకి తీసుకురావటం. లువా పటిదీర్ల సామాజికవర్గంలో నరేష్ కు విపరీతమైన పట్టుంది. పైగా పెద్ద పారిశ్రామికవేత్తకూడా. రాష్ట్రంలోని కీలకమైన సౌరాష్ట్రలో నరేష్ తన ట్రస్ట్ ఆధ్వర్యంలో ఖగ్వద్ ప్రాంతంలో లక్షలాదిమంది భక్తులు కొలిచే కొడియార్ దేవాలయాన్ని నిర్మించారు. దీంతో నరేష్ పటేల్ చాలా పాపులరైపోయారు. ఈమధ్యనే తాను రాజకీయాల్లోకి అడుగుపెట్టాలని అనుకుంటున్నట్లు ప్రకటించారు.





వెంటనే బీజేపీ, కాంగ్రెస్ ఆప్ నరేష్ ను తమ పార్టీల్లోకి చేర్చుకునేందుకు ఎంతో ఆసక్తిచూపాయి. ఒక వ్యక్తిని చేర్చుకునేందుకు మూడుపార్టీలు పోటీపడ్డాయంటేనే నరేష్ ఎంత పాపులరో అర్ధమవుతోంది. అలాంటి నరేష్ తొందరలోనే కాంగ్రెస్ లో చేరబోతున్నారు. ఆమధ్య పటిదార్లకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించాలంటు గుజరాత్ లో పెద్ద ఉద్యమమే జరిగింది. ఆ ఉద్యమంలో కూడా నరేష్ చాలా కీలకంగా వ్యవహరించారు.





అలాంటి నరేష్ తో పీకే చర్చలు జరిపి కాంగ్రెస్ లో చేరేందుకు ఒప్పించారు. అదికూడా ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించే షరతుమీద. నరేష్ ను సీఎం అభ్యర్ధిగా ప్రకటించాలన్న పీకే సూచనకు అధిష్టానం కూడా అభ్యంతరాలు చెప్పలేదట. అసలే 20 ఏళ్ళుగా అధికారానికి మొహం వాచిపోయుంది పార్టీ. ఇలాంటి సమయంలో నరేష్ పటేల్ పాటిదార్ లాంటి పాపులర్ వ్యక్తి పార్టీలో చేరటమంటే మామూలు విషయం కాదు. అందుకనే సీఎం అభ్యర్ధిగా ఒప్పేసుకుంది. మరి పీకే+నరేష్ పటేల్ కలిసి ఎలాంటి వ్యూహాలు పన్నుతారో చూడాల్సిందే. అధికారంలోకి వచ్చినా లేదా పార్టీ పరిస్ధితి బాగా మెరుగైనా కూడా పీకే రాజకీయానికి తిరుగుండదనే అనుకోవాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: