వైసీపీలో టెన్షన్ ఉంటుందా..?
పవన్ కల్యాణ్ కి ఓట్లు లేవు, సీట్లు లేవు అని పదే పదే విమర్శించే వైసీపీ నేతలు కూడా ఎక్కడో ఓ చోట జనసేనని కన్సిడర్ చేయక తప్పదు. పవన్ కల్యాణ్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చేది లేదని ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో టీడీపీకి పవన్ సపోర్ట్ దొరికితే ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఒకేచోటకు చేరితే అన్ని నియోజకవర్గాల్లో కాకపోయినా కొన్నిచోట్ల మాత్రం అధికార పార్టీకి ఇబ్బంది ఎదురవుతుందనడంలో సందేహం లేదు. అందుకే వైసీపీలో కొందరు నాయకులు పవన్ పర్యటనతో కలవరడపుతున్నట్టు తెలుస్తోంది.
పవన్ నిలబడగలరా..?
పవన్ కల్యాణ్ ప్రసంగాలు ఆవేశంగా ఉంటాయి, ఆయన నిర్ణయాల్లో కూడా ఆవేశం కనపడుతుంది. మరి వాటిపై పవన్ ఎంతవరకు నిలబడగలరనేదే ఇప్పుడు సమస్య. కొత్త సంవత్సరం అందరి జీవితాల్లో వెలుగు, ఆనందం రావాలని కోరుకుంటున్నట్టు తెలిపారు పవన్ కల్యాణ్. కౌలు రైతుల ఆత్మహత్యల గురించి వింటుంటే బాధనిపిస్తోందని, అందుకే తాను పోరాటయాత్ర చేపడుతున్నానని అన్నారు. వైసీపీ కౌలు రైతుల కష్టాలు పట్టించుకోలేదని, అందుకే తాను ఆర్థిక సాయం చేస్తూ ముందుకు సాగుతానని అన్నారు. కేవలం ఆర్థిక సాయం, పరామర్శతో సరిపెట్టకుండా పవన్, ఇకపై నిత్యం ప్రజల్లో ఉండేలా కార్యాచరణ మరింత గట్టిగా రూపొందించుకోవాలి. గత ఎన్నికల సమయంలో జగన్ పాదయాత్ర చేసినట్టు, పవన్ కూడా యాత్ర మొదలు పెడితే కాస్తో కూస్తో జనసైనికుల్లో చలనం మొదలవుతుంది. అది ఎన్నికల వరకు బలంగా ఉంటే పార్టీకి మంచిదని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.