తొందరలో జరగబోయే మంత్రివర్గ పునర్ వ్యవస్ధీకరణకు ముహూర్తం కుదిరింది. మరి వేదిక ఎక్కడ ? ఆ వేదికను వైజాగ్ గా జగన్మోహన్ రెడ్డి డిసైడ్ చేసినట్లు పార్టీవర్గాలు చెబుతున్నాయి. అన్నీ కుదిరితే కొత్తమంత్రివర్గ ప్రమాణస్వీకారం వైజాగ్ లో జరుగుతుందంటున్నారు. దీనివల్ల మూడు రాజధానుల కాన్సెప్టుకే తమ ప్రభుత్వం కట్టుబడుందని జనాలకు సిగ్నల్ ఇచ్చినట్లవుతుంది.
మూడేళ్ళక్రితం జగన్ ప్రమాణస్వీకారం చేసినపుడు విజయవాడలోనే మంత్రులంతా ప్రమాణస్వీకారం చేశారు. కానీ ఆ తర్వాత జరిగిన అనేక రాజకీయ పరిణామాల్లో జగన్ మూడు రాజధానుల కాన్సెప్టును తెరమీదకు తెచ్చారు. ఇందులో పరిపాలనా రాజధానిగా వైజాగ్ ను జగన్ ఎంచుకున్నారు. అప్పటినుండి విశాఖపట్నంకు ప్రభుత్వం బాగా ప్రాధాన్యతిస్తోంది. ఇదే సమయంలో మూడు రాజధానుల ప్రతిపాదనను హైకోర్టు కొట్టేసింది. జనాలకు కూడా జగన్ విషయంలో ఒక క్లారిటి ఉంది. జగన్ ఏదన్నా డిసైడ్ అయితే చివరివరకు వదిలిపెట్టడని బాగా తెలుసు. ఇదే విషయాన్ని పార్టీవర్గాలు గుర్తుచేస్తున్నాయి. ఇందులో భాగంగానే ప్రమాణస్వీకారానికి వైజాగ్ ను ఎంచుకున్నారట.
అయితే హైకోర్టు తీర్పుపై జగన్ తీవ్ర అభ్యంతరాలను లేవనెత్తారు. హైకోర్టు చెప్పినట్లుగా అమరావతి నగర నిర్మాణం ఆరుమాసాల్లో సాధ్యంకాదని తేల్చేశారు. ఆచరణ సాధ్యంకాని తీర్పులిస్తే ఆచరించటం తమ వల్ల కాదని అసెంబ్లీలోనే జగన్ స్పష్టంగా ప్రకటించారు. ఒకవైపు హైకోర్టు తీర్పు సంచలనంగా మారితే మరోవైపు జగన్ ప్రకటన ఇంకా సంచలనమైంది. ఈ నేపధ్యంలోనే ప్రభుత్వ ఆలోచనలకు తగ్గట్లుగా ప్రభుత్వం కోర్టులో పెద్ద అఫిడవిట్ దాఖలు చేసింది.
ఈ నేపధ్యంలోనే కొత్తమంత్రివర్గం ప్రమాణస్వీకారాన్ని వైజాగ్ లో పెట్టాలని జగన్ నిర్ణయించారట. దీనివల్ల తమ ప్రభుత్వ ఉద్దేశ్యం, లక్ష్యం ఏమిటో ప్రజలకు ముఖ్యంగా ఉత్తరాంధ్ర జనాలకు తెలియజేసినట్లవుతుందని జగన్ ఆలోచిస్తున్నారట. ఉత్తరాంధ్ర విషయంలో జగన్ పట్టుదల వల్ల కర్నూలులోనే న్యాయ రాజధాని ఉంటుందనే సంకేతాలు కూడా పంపినట్లవుతుంది. మొత్తానికి మూడు రాజధానుల కాన్సెప్టులో తాను అనుకున్నట్లే జగన్ ముందుకెళుతున్నారు. చివరకు జనాల ఆలోచన ఎలాగుంటుందో చూడాల్సిందే.