వైసీపీలో మంత్రివర్గం కూర్పు తాలూకు వేడి దాదాపు చల్లారినట్లే ఉంది. ఎంఎల్ఏలు అలగటం వాళ్ళని బుజ్జగించటం అంతా సహజంగా సాగేదే. అయితే ఇక్కడ గమనించాల్సిందేమంటే ఇద్దరు మాజీమంత్రులు కూడా ముందు అలిగారు. తర్వాత ఆగ్రహంతో ఊగిపోయారు. రెండు రోజులు రకరకాల డ్రామాల తర్వాత ఒక్కసారిగా చల్లారిపోయారు. ఆగ్రహంతో, అసంతృప్తితో ఎంత ఎత్తుకు వెళ్ళారో అంతే వేగంతో చప్పున చల్లారిపోయారు. దీనికి కారణం ఏమిటబ్బా అని ఆరాతీస్తే ఒక విషయం తెలిసింది.
అదేమిటంటే రాజీనామాల అస్త్రానికి మాజీమంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, మేకతోటి సుచరిత క్లాన్ బౌల్డ్ అయిపోయారట. ఒకసారి ఎంఎల్ఏ పదవులకు రాజీనామాలు చేస్తే తమ భవిష్యత్తు ఏమిటో వీళ్ళకి బాగా అర్ధమైపోయిందట. ఇంతకీ దీని నేపధ్యం ఏమిటంటే మంత్రిపదవులు రెన్యు కాలేదని వీళ్ళద్దరికి జగన్మోహన్ రెడ్డిపై పీకలదాకా కోపం వచ్చేసింది. అయితే వీళ్ళని చల్లార్చటానికి జగన్ చేసిన ప్రయత్నాలు ఫెయిలయ్యాయి. బాలినేని ఇంటికి సజ్జల రామకృష్ణారెడ్డి మూడుసార్లు వెళ్ళారు.
అలాగే మేకతోటి ఇంటికి రాజ్యసభ ఎంపీ మోపిదేవి వెంకటరమణ రెండుసార్లు వెళ్ళినా ఉపయోగం కనబడలేదు. ఇద్దరు కూడా ఎంఎల్ఏల పదవులకు రాజీనామాలు చేసేస్తామని చెప్పారట. దాంతో అదే విషయాన్ని దూతలిద్దరు జగన్ కు చెప్పారట. వెంటనే జగన్ కూడా వాళ్ళదగ్గర రాజీనామాలు తీసేసుకోమన్నారట. వాటిని వెంటనే స్పీకర్ కు పంపి ఆమోదిం తీసుకోమని కూడా ఆదేశించారట. అయితే దూతలిద్దరు జగన్ కు కాస్త నచ్చచెప్పినట్లు సమాచారం. రాజీనామాలు తీసుకుంటే ఇద్దరు అన్యాయమైపోతారని కాబట్టి చివరగా మరోసారి చెప్పిచూస్తామని చెప్పారట.
తర్వాత వాళ్ళిద్దరిని కలిసి జగన్ ఆలోచన ఏమిటో స్పష్టం చేశారట. దాంతో వెంటనే మరో ఆలోచన లేకుండా రాజీనామాల మాటను ఉపసంహరించుకున్నట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. జగన్ ఫైనల్ వార్నింగ్ గనుక వినకపోయుంటే ఈపాటికి ఉపఎన్నికల హీట్ మొదలైపోయేదేమో. అదే జరిగితే వీళ్ళ భవిష్యత్తు ఏమిటో నిర్ణయమైపోయేదే. జగన్ను కాదని వెళితే భవిష్యత్తేమిటో అర్ధమైనట్లుంది. అందుకనే వెంటనే జగన్ను కలిసి మాట్లాడుకుని పరిస్ధితిని సర్దుబాటు చేసుకున్నారు.