మాజీమంత్రి గంటా శ్రీనివాసరావుకు ఇంతకాలానికి ధైర్యం వచ్చినట్లుంది. 2019లో విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గంలో గెలిచిన దగ్గర నుండి ఇప్పటివరకు పెద్దగా యాక్టివ్ గా లేరు. గెలిచింది టీడీపీ తరపునే అయినప్పటికీ పార్టీ అధినేత చంద్రబాబునాయుడుతో పాటు ఇతర తమ్ముళ్ళతో కూడా అంటీ ముట్టనట్లుగానే ఉన్నారు. గంటా వైఖరి ఏమిటో అర్ధంకాక చివరకు చంద్రబాబే ఈ మాజీమంత్రిని వదిలేశారు. జిల్లాలోని నేతలు కూడా గంటా పార్టీని వదిలేసినట్లే అని డిసైడ్ అయిపోయారు.





మధ్యలో విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ విషయంలో రాజీనామా పేరుతో కాస్త హడావుడి చేసినా తర్వాత అడ్రస్ లేకుండా పోయారు. వైసీపీలో చేరటానికి చేసిన ప్రయత్నాలన్నీ ఫెయిలైనట్లు వైసీపీ నేతలు చెప్పారు. దాంతో తమ్ముళ్ళతో పాటు చివరకు మీడియాకు కూడా దొరకటంలేదు. దాదాపు అజ్ఞాతంలోనే ఉంటున్న గంటా ఒక్కసారిగా వెలుగులోకి వచ్చారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా టీడీపీ ఆఫీసుకొచ్చారు. కార్యక్రమంలో పాల్గొన్న అధికారపార్టీపై నోటికొచ్చినట్లు మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి బలహీనపడిపోయినట్లు చెప్పారు.





తొందరలోనే మాజీమంత్రులు, ఎంఎల్ఏలు, నేతలు టీడీపీలో చేరబోతున్నట్లు చెప్పారు. అంతా బాగానే ఉందికానీ గంటా వైసీపీపైన ఇలా మాట్లాడటానికి కారణం ఏమిటి ? ఏమిటంటే జనసేన-టీడీపీ పొత్తు ఖాయమైనట్లుంది. టీడీపీ తరపున పోటీచేస్తే గెలిచేది అనుమానమే. అలాగని జనసేనలోకి వెళ్ళినా ఇదే పరిస్ధితి. అందుకనే రెండుపార్టీలు కలవాలని గంటా బలంగా కోరుకుంటున్నారు. పొత్తులో తాను టీడీపీ తరపున పోటీచేస్తే గెలుపు ఖాయమని గంటాకు ఇప్పటికి ధైర్యం వచ్చినట్లుంది. అందుకనే ధైర్యంగా జగన్ పైన కూడా విమర్శలు మొదలుపెట్టారు.






వచ్చే ఎన్నికల్లో గంటా పోటీచేయటానికి గాజువాకను ఎంచుకున్నట్లు సమాచారం. అందుకనే గాజువాక కేంద్రంగా గంటా హడావుడి చేస్తున్నారు. టీడీపీ+జనసేన కలిస్తే తన గెలుపు ఖాయమని గంటా చేయించుకున్న సర్వేలో తేలిందట. రెండుపార్టీలు పొత్తుపెట్టుకోవటం ఖాయమన్న సమాచారం అందిన తర్వాత గంటా హఠాత్తుగా పార్టీ ఆఫీసుకు వచ్చారని తమ్ముళ్ళు అనుమానిస్తున్నారు. చంద్రబాబు రమ్మంటేనే కుదరదని చెప్పిన గంటా పార్టీ ఆఫీసుకు వచ్చారంటేనే రెండుపార్టీల మధ్య పొత్తుధైర్యమే అని తమ్ముళ్ళు చెప్పుకుంటున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: