తన సన్మాన కార్యక్రమంలో రెవిన్యు మంత్రి ధర్మాన ప్రసాదరావు చేసిన వ్యాఖ్యలపై పార్టీలో పెద్దఎత్తున చర్చలు మొదలయ్యాయి. కార్యక్రమంలో ధర్మాన మాట్లాడుతు వయోభారం పెరిగేకొద్దీ రాజకీయాలపై తనకు ఆసక్తి తగ్గిపోతోందన్నారు. తొందరలోనే విరామం ప్రకటించేసి కొత్తవారికి అవకాశం ఇవ్వాలనే ఆలోచన పెరిగిపోతోందట. అయితే ప్రజల ఆధరాభిమానులే ఇందుకు అడ్డొస్తున్నాయని ధర్మాన చెప్పారు. ధర్మాన ఇంతకుముందే మూడుసార్లు మంత్రిగా పనిచేసిన విషయం తెలిసిందే. 





ఈ వ్యాఖ్యలను చూసిన తర్వాత ధర్మాన తొందరలోనే రాజకీయాల్లో నుండి రిటైర్ అవ్వబోతున్నట్లుగా అర్ధమైపోతోంది. ఈ విషయం ఇప్పుడేమీ కొత్తకాదు. కొంతకాలంగా అందరు ఊహిస్తున్నదే. ఎప్పుడైతే మూడేళ్ళ క్రితం మంత్రివర్గం నుండి ప్రసాదరావును జగన్మోహన్ రెడ్డి దూరంగాపెట్టేశారో అప్పటినుండే ఈ మంత్రిలో వైరాగ్యం మొదలైంది. మంత్రిపదవిపై తనకు మోజులేదని పైకి చెప్పినా నమ్మేవాళ్ళెవరూ లేరు. ఎందుకంటే మంత్రివర్గంలో చోటుకోసం ప్రసాదరావు అలక, కొన్నిసార్లు ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేట్లుగా చేసిన వ్యాఖ్యలు అందరికీ తెలిసిందే.





ఈ నేపధ్యంలోనే రాజకీయాలనుండి దాదాపు విరమించుకుంటున్నట్లు సంకేతాలిచ్చారు. అందుకనే కొడుకు ధర్మాన రమ్మనోహర్ నాయుడు బాగా యాక్టివ్ అయిపోయింది. నియోజకవర్గంలో మంచి చెడు ఏది జరిగినా ప్రసాదరావు కాకుండా కొడుకే ఎక్కువగా హాజరయ్యారు. ఇక మంత్రిపదవి వచ్చే అవకాశం లేదని భావించబట్టే కొడుకును ప్రసాదరావు ముందుకు తోశారు. అయితే అనూహ్యంగా రాజకీయం మలుపులు తిరిగిన కారణంగా అన్న ధర్మా కృష్ణదాసు పక్కకు తప్పుకుని తమ్ముడు ప్రసాదరావు కోసం పట్టుబట్టడంతో జగన్ కూడా సరేఅని ప్రసాదరావుకు మంత్రివర్గంలో చోటిచ్చారు.






దాంతో ప్రసాదరావు ఒక్కసారిగా మళ్ళీ యాక్టివ్ అయిపోయారు. అయితే సన్మాన కార్యక్రమంలో వైరాగ్యపు మాటలు మాట్లాడటమే ఆశ్చర్యంగా ఉంది. ఏదేమైనా మంత్రిగా రిటైర్ అయిపోయి తన కొడుక్కి వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇప్పించుకోవటం ఖాయమనే అనుకుంటున్నారు. అందుకనే ముందుగా క్యాడర్ ను మానసికంగా రెడీ చేస్తున్నట్లున్నారు. అంటే ఇంతకాలం తండ్రిచాటు కొడుకుగా ఉన్న రామ్మనోహర్ నాయుడు ఇకనుండి డైరెక్టుగానే తెరమీదకు వచ్చేస్తాని అర్ధమైపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: