కాంగ్రెస్ పార్టీలోకి రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చేరిక దాదాపు ఓకే అయిపోయినట్లే. ఏదో లాంఛనం మాత్రమే మిగులుందని అందరు అనుకుంటున్నారు. ఇలాంటి సమయంలో హఠాత్తుగా పీకే చేరికపై కాంగ్రెస్ షరతులు విధించిన విషయం వెలుగులోకి రావటం ఆశ్చర్యంగా ఉంది. ఒకవైపు పీకే ఏమో భేషరతుగా తనను పార్టీలోకి చేర్చుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే సమయంలో పార్టీఏమో పెద్ద షరతు పెట్టిందట.
ఇంతకీ విషయం ఏమిటంటే కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో ఇప్పటికే పీకే ఐదుసార్లు భేటీ అయ్యారు. పార్టీ పునరుత్ధానికి పెద్ద పవర్ పాయింట్ ప్రజంటేషన్ కూడా ఇచ్చారు. ఈ పవర్ పాయింట్ ప్రజంటేషన్ పై సీనియర్ నేతలంతా సానుకూలంగానే ఉన్నారు. ఇదే విషయాన్ని ఒక రిపోర్టు రూపంలో సోనియాకు సీనియర్లు అందించారు. దాంతో పీకే పార్టీలో చేరిపోవటం ఇక లాంఛనమే అనుకున్నారు. కానీ హఠాత్తుగా సీనియర్లు పీకేకి ఒక షరతు విధించారట.
అదేమిటంటే పీకే భవిష్యత్తులో ఏ పార్టీతోను పనిచేయకూడదని సీనియర్లు షరతు విధించారని సమాచారం. ఐప్యాక్ కంపెనీ పేరుతో పీకే ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లోని వివిధ పార్టీలతో పనిచేస్తున్నారు. అలాగే అనేక పార్టీల అధినేతలతో సన్నిహిత సంబంధాలున్నాయి. కాంగ్రెస్ పార్టీలో పూర్తిస్ధాయిలో పనిచేస్తు ఇతర పార్టీలతో వ్యాపారపరమైన సంబంధాలు మైన్ టెన్ చేయటం మంచిదికాదని సీనియర్లు అభ్యంతరం వ్యక్తంచేశారు.
అయితే పీకే తరపున పెద్ద సమస్య ఒకటుంది. అదేమిటంటే ఇప్పటికే వివిధ పార్టీల తరపున పనిచేస్తున్నారంటే దానికి ముందు పక్కా కాట్రాక్టు చేసుకునుంటారు. ఒక కాంట్రాక్టంటే వందల కోట్ల రూపాయల విలువుంటుంది. అలాంటిది హఠాత్తుగా కాంట్రాక్టులన్నింటినీ రద్దు చేసుకోవాలంటే సమస్యే. పోనీ తాను ఐప్యాక్ నుండి తప్పుకుని వేరే వాళ్ళకు బాధ్యతలు ఇవ్వాలని అనుకున్నా సాధ్యంకాదు. ఎందుకంటే పార్టీల అధినేతలు ఐప్యాక్ తో చేసుకున్న ఒప్పందాలు పీకేని చూసే కానీ మరొకళ్ళని చూసికాదు. మరి ఈ కాంగ్రెస్ షరతుపై పీకే ఏమిచేస్తారో చూడాల్సిందే.