రోజూ ఓ కొత్త కరోనా వేరియంట్ వెలుగు చూస్తున్న ప్రస్తుత తరుణంలో శాస్త్రవేత్తలు సరికొత్త కోవిడ్ వ్యాక్సిన్ ను కనుగొన్నారు. మొక్కల ఆధారంగా కెనడాకు చెందిన మెడికాగో సంస్థ రూపొందించిన నూతన టీకా..5కరోనా వేరియంట్లపై 70శాతం సామర్థ్యంతో పనిచేస్తున్నట్టు నిర్ధారించారు. ఏఎస్03 అనే పదార్థంతో మక్కల ఆధారంగా ఈ వ్యాక్సిన్ తయారు చేశారు. మొత్తం 24వేల 141మందిపై దీన్ని పరీక్షించగా సత్ఫలితాలు వచ్చాయి.

మరోవైపు ఇప్పుడిప్పుడే తగ్గిందని భావిస్తున్న కరోనా వైరస్ త్వరలోనే మళ్లీ విజృంభిస్తుందని ఇజ్రాయెల్ పరిశోధకులు హెచ్చరించారు. డెల్టా లేదా కొత్త వేరియంట్ ఇందుకు కారణం కావొచ్చన్నారు. డెల్టా వేరియంట్ అంతకు ముందున్న వైరస్ కారకాలను అంతం చేయగా.. ఒమిక్రాన్ డెల్టాను ఏమీ చేయలేకపోయిందని తెలిపారు. త్వరలో ఒమిక్రాన్ అంతమైనా.. డెల్టా మాత్రం తన వ్యాప్తిని కొనసాగించి మరింత శక్తిమంతంగా మారవచ్చని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

ప్రపంచ వ్యాప్తంగా కరోనా కారణంగా సుమారు 1.49కోట్ల మంది మరణించినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేసింది. 2020 జనవరి 1 నుంచి 31డిసెంబర్ 2021 మధ్య కాలంలో కరోనాతో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సంభవించిన మరణాలను డబ్ల్యూహెచ్ ఓ ప్రకటించింది. ప్రపంచంలో మొత్తం 1.49కోట్ల మంది మరణించినట్టు తెలిపింది. అయితే ఇండియాలో సుమారు 47లక్షల మంది కరోనా వైరస్ కారణంగా చనిపోయినట్టు వెల్లడించింది.

ఇక దేశంలో కరోనా మరణాల సంఖ్యపై గందరగోళం నెలకొంది. 5లక్షల 23వేల 975మంది వైరస్ తో మరణించారని కేంద్ర ఆరోగ్య శాఖ అధికారిక వెబ్ సైట్ లో పేర్కొంది. అయితే భారత్ లో 47లక్షల మంది కరోనాతో మరణించారని తాజాగా డబ్ల్యూహెచ్ ఓ తన నివేదికలో తెలిపింది. అయితే ఆ నివేదికను భారత్ తప్పుబట్టింది. డబ్ల్యూహెచ్ ఓ మరణాల డేటా సేకరణ అనుమానాస్పదంగా ఉందని అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే ఎవరి లెక్కలు నమ్మాలో తెలియక ప్రజలు అయోమయానికి గురవుతున్నారు.





































మరింత సమాచారం తెలుసుకోండి: