మరోవైపు ఉక్రెయిన్ పై యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేసే దిశగా రష్యా అడుగులు వేస్తోంది. ఆ దేశంపై అణ్వాయుధాల ప్రయోగానికి సిద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది. అణు సామర్థ్యం గల క్షిపణి దాడుల నిర్వహణపై కలినిన్ గ్రాడ్ నగరంలో తమ దళాలు ప్రాక్టీస్ చేస్తున్నట్టు రష్యా ప్రకటించింది. దాడుల అనంతరం వెలువడే రేడియేషన్, రసాయన పరిస్థితుల్లో చేపట్టాల్సిన చర్యలపై 100మందికిపైగా తమ స్పెషల్ కమాండోస్ సాధన చేసినట్టు రష్యా వెల్లడించింది.
ఉక్రెయిన్ నగరాలపై రష్యా బలగాలు విరుచుకుపడుతున్నాయి. డాన్ బాస్ ప్రాంతంపై జరిపిన దాడుల్లో 21మంది ఉక్రెయిన్ పౌరులు మృతి చెందారు. మేరియుపోల్ ఉక్కు కర్మాగారంపై దాడులు పెంచాయి. రష్యా దాడుల వల్ల కర్మాగారంలో భారీగా రక్తపాతం జరిగిందని ఉక్రెయిన్ సైన్యం తెలిపింది. రష్యా బలగాలను ధీటుగా ఎదుర్కొంటున్నట్టు ఉక్రెయిన్ సేనలు ప్రకటించాయి.
ఇక ఉక్రెయిన్ కు అమెరికా సహా ఇతర దేశాల సాయంపై రష్యా కన్నెర్రజేసింది. పలు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని దాడులను పెంచింది. తూర్పు డాన్ బాస్ పై జరిపిన దాడిలో 21మంది ఉక్రెయిన్ పౌరులు ప్రాణాలు కోల్పోవడం పట్ల అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఐదు రైల్వే స్టేషన్లలో విద్యుత్ వ్యవస్థలను రష్యా సేనలు ధ్వంసం చేశాయి. చములు, ఆయుధ డిపోలను నేలమట్టం చేస్తున్నాయి. అజోవ్ స్తల్ ఉక్కు కర్మాగారాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తెచ్చుకున్నాయి.
ఇక ఉక్రెయిన్ పై పుతిన్ సేన అణ్వస్త్రాల ప్రయోగానికి సిద్ధమవుతున్నట్టు వార్తలు వస్తున్న కారణంగా.. రష్యా ఈ అంశంపై క్లారిటీ ఇచ్చింది. ఉక్రెయిన్ లో వ్యూహాత్మక అమ్వాయుధాలను మోహరించే ఉద్దేశం తమకు లేదని తెలిపింది. అమెరికా సహా ఇతర దేశాలు తమపై నిరాధార ఆరోపణలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉక్రెయిన్ పై అణ్వస్త్ర దాడికి దిగేది లేదని రష్యా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అలెక్సీ జైత్సెవ్ స్పష్టం చేశారు.