కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ మరీ ఇంత అమాయకుడా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. వరంగల్ రైతు సంఘర్షణ సభలో చక్కగా మాట్లాడారు. మరుసటిరోజు హైదరాబాద్ లో జైల్లో ఉన్న ఎన్ఎస్ యూఐ నేతలను పరామర్శించిన సమయంలో కూడా వాళ్ళకి బాగానే ధైర్యంచెప్పారు. పార్టీ అగ్రనేత ఎలా మాట్లాడాలో రాహుల్ అలానే మాట్లాడారు. బహిరంగసభలో మాట్లాడిన తీరు, జైల్లో యువనేతలతో మాట్లాడిన తర్వాత రాహుల్ స్పీచులో బాగా పరిణతి కనిపించింది.
అయితే గాంధీభవన్లో నేతలను ఉద్దేశించి మాట్లాడిన తీరుచూసిన తర్వాతే అమాయకత్వం బయటపడింది. ఇంతకీ రాహుల్ చెప్పిందేమంటే మెరిట్ ఆధారంగా మాత్రమే టికెట్లిస్తారట. ప్రజలు, రైతులపక్షాన పోరాటంచేసేవారికీ టికెట్లట. పార్టీకోసం పనిచేయనివారికి, హైదరాబాద్ లో కూర్చునే వారికి, ఢిల్లీ చుట్టూ తిరిగేవారికి టికెట్లు రావన్నారు. హైదరాబాద్ వదిలి గ్రామాల్లో తిరగాలని, వెనుకడోరు ద్వారా ప్రయత్నాలు చేసుకునేవారు టికెట్లపై ఆశలు వదిలేసుకోవాలన్నారు. అసలు పార్టీలో టికెట్ల కేటాయింపు ఎలా జరుగుతుందో తెలియనట్లే మాట్లాడటమే విచిత్రం.
రాహుల్ వార్నింగులు చూసిన వారిలో కొందరికి ఇదంతా నిజమేనా అనుమానాలు వచ్చేసుంటాయి. అసలు కాంగ్రెస్ లో టికెట్లు ఎలా కేటాయిస్తారు ? రాజకీయాలపై అవగాహన ఉన్నవారెవరిని అడిగినా ఇట్టే చెప్పేస్తారు. కాంగ్రెస్ అంటేనే ముఠాల పార్టీయని, లాబీయింగులకే టికెట్లు దక్కుతాయని అందరికీ తెలిసిందే. రాహుల్ కాదంటే ప్రియాంక దగ్గరకు వెళతారు. ప్రియాంకా కూడా కాదంటే సోనియాగాంధీ దగ్గరకు నేరుగా వెళ్ళిపోతారు. ఇప్పటివరకు టికెట్లు దక్కించుకున్న వాళ్ళల్లో అత్యధికులు ఈ పద్దతిలో టికెట్లు దక్కించుకున్నవారే.
అసలు టికెట్ల కేటాయింపులో పీసీసీ స్ర్కీనింగ్ కమిటి అనేదొకటుంటుంది. అయితే దాన్నెవరూ పట్టించుకోరు. టికెట్ల విషయంలో పీసీసీకి దరఖాస్తు చేసుకోకుండా నేరుగా ఢిల్లీకి వెళ్ళిపోయి టికెట్లు తెచ్చేసుకునే వాళ్ళే ఎక్కువ. రాహుల్ చెప్పింది నిజంగా జరిగితే బాగానే ఉంటుంది. కానీ రాహుల్ చెప్పింది జరగటం, ఏనుగుకు గోచీపాత పెట్టడం ఒకటే అని కాంగ్రెస్ వ్యవహారాలు దగ్గర నుండి చూసే వాళ్ళకు బాగా తెలుసు.