కొంతమంది రాజకీయ నేతలు ఎప్పుడూ భ్రమల్లోనే బతికేస్తుంటారు. వాళ్ళకు క్షేత్రస్ధాయిలోని వాస్తవాలతో కానీ, జరుగుతున్నదాంతోకానీ ఎలాంటి సంబంధం ఉండదు. తమ ఆలోచనలకు విరుద్ధంగా జరుగుతున్నా సరే వాళ్ళకుమాత్రం అంతా బ్రహ్మాండంగా ఉందనే కనబడుతుంటుంది. ఇలాంటి నేతల్లో చంద్రబాబునాయుడును మొదటివ్యక్తిగా చెప్పుకోవాలి. హైదరాబాద్ లోని ఎన్టీయార్ భవన్లో నేతలతో చంద్రబాబు చెప్పిన మాటలే ఉదాహరణగా నిలుస్తోంది.
ఇంతకీ చంద్రబాబు చెప్పిన ఆణిముత్యాలు ఏమిటంటే అభివృద్ధిచేసి ప్రజాధరణ పొందటమే తన రాజకీయమన్నారు. రాజకీయాన్ని వ్యాపారంగా తానెప్పుడూ చూడలేదట. యువతకు ఉపాధి చూపించటం, రైతు, మహిళా సాధికారత సాధించటమే ధ్యేయంగా పనిచేశారట. ప్రజల్లో తనకున్న గుడ్ విల్, క్రెడిబులిటి ఏమిటో తాను చేసిన పనులే చెబుతాయన్నారు. టీడీపీ చేసిన అభివృద్ధంతా కళ్ళముందే కనబడుతోందట. అభివృద్ధిని చూపించి తెలంగాణాలో మళ్ళీ పార్టీ ప్రజాధరణ పొందాలన్నారు.
నిజానికి చంద్రబాబు చెప్పిన మాటల్లో ఏ ఒక్కటికూడా ఆయనకు వర్తించదు. చంద్రబాబుకు నిజంగానే గుడ్ విల్ , క్రెడిబులిటి ఉంటే జనాలు అంత ఘోరంగా ఎందుకు ఓడిస్తారు ? మిగిలిన రాష్ట్రమంతా వదిలేసినా కుప్పంలో స్ధానికసంస్ధల, మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ ఎందుకు చిత్తుగా ఓడిపోయింది ? ఇక యువతకు ఉపాధి ఏమి చూపించారో అర్ధం కావటంలేదు. రైతు, మహిళా సాధికారతే ధ్యేయంగా పనిచేశారట. 2014 ఎన్నికల్లో రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణాల మాఫీ హామీ ఇచ్చారు. మరి ఆ రెండు హామీలను నిలబెట్టుకున్నారా ?
ఎన్నికలముందు ఆచరణసాధ్యంకాని హామీలనిచ్చేయటం తర్వాత వాటిని తుంగలో తొక్కేయటం చంద్రబాబుకు బాగా అలవాటు. రాజకీయాలను వ్యాపారంగా ఎప్పుడూ చూడలేదన్నారు. అదే నిజమైతే తిరుపతిలో అప్పుడెప్పుడో విష్ణుప్రియా హోటల్ ఎలా కట్టారు ? భువనేశ్వరి కార్బైట్స్ ఎలా పెట్టారు ? హెరిటేజ్ సంస్ధను ఎలా ఏర్పాటుచేశారు ? ఇవన్నీ వ్యాపారసంస్ధలు కావా ? రాజకీయాలను అడ్డంపెట్టుకుని ఏర్పాటు చేయలేదా ? పిల్లి కళ్ళుమూసుకుని పాలు తాగుతు తనను ఎవరు చూడటంలేదని అనుకుంటుందట. చంద్రబాబుది కూడా అదే పద్దతి.