పొత్తుల వ్యవహారం తెరమీదకు వచ్చేకొద్దీ, పొత్తులపై చర్చలు పెరిగేకొద్దీ తెలుగుదేశంపార్టీ, జనసేన నేతలకు పిచ్చెక్కినట్లు అయిపోతోంది. అసలు ఈ రెండుపార్టీల మధ్య పొత్తుంటుందా ? ఉండదా ? ఉంటే ఏ పార్టీ ఎన్నిసీట్లలో పోటీచేస్తుందనే విషయమై రెండుపార్టీల్లోను నేతలమధ్య చర్చలు పెరిగిపోతున్నాయి. ఒకవైపు చంద్రబాబునాయుడు జనసేనతో పొత్తు పెట్టుకునేందుకు రెడీగా ఉన్నట్లు ఎప్పుడో ప్రకటించారు.
ఇదే విషయాన్ని మీడియా పవన్ కల్యాణ్ దగ్గర ప్రస్తావిస్తే పొత్తు ప్రతిపాదన చంద్రబాబు నుండి వచ్చినపుడు చూస్తానంటు తప్పించుకున్నారు. పొత్తు పెట్టుకోవటానికి తాను రెడీగా ఉన్నట్లు చంద్రబాబు బహిరంగంగా ప్రకటించిన తర్వాత కూడా ఇంకా పొత్తు ప్రతిపాదన వస్తే చూస్తానని చెప్పటంలో అర్ధమేంటో అర్ధంకావటంలేదు. మళ్ళీ ఇద్దరు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలనిచ్చేది లేదంటారు, అన్నీపార్టీలు కలిస్తేకానీ జగన్మోహన్ రెడ్డిని ఓడించటం సాధ్యం కాదంటారు.
ఇదే సమయంలో ప్రతిపక్షాలు కలవకపోతే మళ్ళీ జగనే సీఎం అవ్వటం ఖాయమని జోస్యం కూడా చెబుతున్నారు. మధ్యలో బీజేపీ చీఫ్ సోమువీర్రాజేమో అసలు చంద్రబాబుతో కలిసేదే లేదని తెగేసి చెబుతున్నారు. హోలు మొత్తంమీద టీడీపీ-జనసేన మధ్య పొత్తుంటుందని అనుకుంటున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. ఇలాంటి నేపధ్యంలోనే రెండు పార్టీలు సీట్ల షేరింగ్ ఎలాగుంటుందనేది పెద్ద పజిల్ అయిపోయింది. దాంతో పొత్తుల్లో ఏ పార్టీ ఎన్నిసీట్లలో పోటీచేస్తుందో తెలీక, ఏ నియోజకవర్గం ఏపార్టీకి వెళుతుందో తెలీక టీడీపీ నేతలు పిచ్చెక్కిపోతున్నారు.
తమ నియోజకవర్గాల్లో కష్టపడి పనిచేసిన తర్వాత చివరకు ఆ నియోజకవర్గం మిత్రపక్షానికి వెళిపోతే తాము ఏమిచేయాలనే అనుమానాలు ఎక్కువగా టీడీపీ నేతల్లోనే పెరిగిపోతోంది. పైగా జనసేన 60 సీట్లు అడుగుతోందనే ప్రచారం పెరిగిపోతోంది. దాంతో జనసేన అడిగే 60 నియోజకవర్గాలేవి ? అసలా నియోజకవర్గాల్లో జనసేన బలమెంత ? అనే చర్చ కూడా మొదలైంది. మొత్తంమీద జగన్ కు వ్యతిరేకంగా కలవాలన్నా ఏకైక పాయింట్ తప్ప మిగిలన అన్నీ విషయాల్లోను రెండుపార్టీల నేతల మధ్య వివాదాలు చాలానే ఉన్నాయి.