వచ్చేఎన్నికల్లో మంత్రి పెద్దిరెడ్డిరామచంద్రారెడ్డిని ఎలాగైనాసరే ఓడించాలనేది చంద్రబాబునాయుడు పట్టుదల. పుంగనూరు నియోజకవర్గంలో పెద్దిరెడ్డి బలంగా పాతుకుపోయున్నారు. అధికారంతో సంబంధంలేకుండా 24 గంటలూ జనాల్లోనే ఉంటారు కాబట్టి నియోజకవర్గంలో జనాల మద్దతు కూడా అపారంగా ఉంది. ఇదే సమయంలో తన మద్దతుదారులకు ఏమైనా చేయాలంటే ఎంతకైనా తెగించే గుణంవల్లే మద్దతుదారులు కూడా ఈయన్ను వదిలిపెట్టి వెళ్ళరు.






మరిలాంటి బలమైన నేతను ఎన్నికల్లో దెబ్బకొట్టాలంటే ప్రత్యర్ధులు ఎలాంటి వ్యూహాలు రచించాలి ? ఒకరి వల్ల కానపుడు పదిమంది ఏకమవ్వటంలో తప్పులేదు. కానీ ఇదే సమయంలో పోటీకి నిలబెడుతున్న నేతకు కూడా జనాల్లో పట్టుండాలి కదా ? అలాంటిది ప్రతి ఎన్నికకు ఒక అభ్యర్ధిని పోటీలోకి దింపుతుంటే ఇక నేతలకు పట్టెక్కడి నుండి వస్తుంది ? ఒకవేళ ఎవరికైనా పట్టుందంటే అది కొద్ది ప్రాంతంలో మాత్రమే అయ్యుంటుంది. మరి మిగిలిన నియోజకవర్గం మాటేమిటి ? ఇక్కడే టీడీపీ దెబ్బతింటోంది.





ఇపుడిదంతా ఎందుకంటే పుంగనూరులో పెద్దిరెడ్డిని ఓడించేందుకు చల్లా రామచంద్రారెడ్డి (బాబు) అనే నేతను రంగంలోకి దింపుతున్నారు. పోయిన ఎన్నికల్లో అనూషారెడ్డి అనే నేత పోటీచేసి ఓడిపోయారు. ఆమె స్ధానంలో చల్లాబాబును ప్రకటించారు. బాబుకు నియోజకవర్గంలో కొంత పట్టుందన్నది వాస్తవమే. అయితే ఆ పట్టుతో పెద్దిరెడ్డిని ఓడించటం అంత తేలిగ్గాదు. ఇక్కడ సమస్య ఏమిటంటే ప్రతి ఎన్నికకు కొత్త అభ్యర్ధి పోటీలోకి దిగటం వల్లే టీడీపీ బలహీనమైపోతోందన్న విషయాన్ని చంద్రబాబు గుర్తించటంలేదు. క్యాడర్ కూడా చెల్లాచెదురైపోతున్నారు.





బహుశా జనసేనతో పొత్తుంటుంది కాబట్టి ఆ పార్టీ ఓట్లు కూడా చల్లాబాబుకు తోడై పెద్దిరెడ్డిని ఈజీగా ఓడించవచ్చని చంద్రబాబు అనుకుంటున్నారేమో. బలమైన నేతన ఓడించాలంటే భ్రమల్లో బతుకితే సరిపోదు. అందుకు తగ్గ కార్యాచరణ కూడా ఉండాలి. అసలు పెద్దిరెడ్డితో పోటీకి చల్లాబాబు ఏమాత్రం సరిపోరనే టాక్ పార్టీలోనే వినిపిస్తోంది. చివరినిముషంలో మాజీమంత్రి అమరనాధరెడ్డే పోటీ చేసినా ఆశ్చర్యపోవక్కర్లేదని పార్టీ నేతలే అంటున్నారు. అలాంటపుడు చల్లా మాత్రం ప్రశాంతంగా ఎలా పనిచేసుకోగలరు ? ఇందుకే పుంగనూరులో టీడీపీ గెలిచినట్లే అనే సెటైర్లు మొదలైపోయాయి. చూద్దాం చివరకు ఏమవుతుందో.



మరింత సమాచారం తెలుసుకోండి: