మంగళ, బుధవారాల్లో కోస్తా జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. తుపాను కేంద్రానికి దూరంగా ఉన్నా కూడా నెల్లూరు జిల్లాలో అత్యథిక వర్షపాతం నమోదు కావడం విశేషం. నెల్లూరుతోపాటు చిత్తూరు జిల్లాలో కూడా భారీగా వర్షాలు కురిశాయి. ఉలవపాడు మండలం కరేడులో అత్యథికంగా 15.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
సముద్రం అల్లకల్లోలం..
బుధవారం నుంచి సముద్ర తీరం అల్లకల్లోలంగా ఉంది. కాకినాడ ప్రాంతంలో సముద్ర తీరం కోతకు గురైంది. సముద్రంలో అలల ఉధృతి కనిపిస్తోంది. నెల్లూరు జిల్లాలో 20మీటర్ల ముందుకు వచ్చింది సముద్రం. అయితే మత్స్యకారులెవరూ వేటకు వెళ్లొద్దని అధికారులు ఇప్పటికే చెప్పడంతో చాలా చోట్ల వారంతా ఇళ్లకే పరిమితం అయ్యారు. పోలీస్, రెవెన్యూ వ్యవస్థలు 24గంటలు ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఎక్కడికక్కడ కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేసి పోలీసులు కూడా పహారా కాస్తున్నారు. ప్రస్తుతం తీరం వెంబడి గంటకు 50 కిలోమీటర్లనుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముంది. మత్స్యకారులు గురువారం వరకు సముద్రంలో వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు.