ఒంగోలులో తెలుగుదేశంపార్టీ ఆధ్వర్యంలో జరిగిన రెండురోజుల మహానాడు కార్యక్రమం సింగిల్ పాయింట్ మీదే నడిచింది. అదేమిటంటే జగన్మోహన్ రెడ్డిని అమ్మనాబూతులు తిట్టడం. చంద్రబాబునాయుడు మొదలు వేదికమీద నుండి మాట్లాడిన ప్రతిఒక్కళ్ళు జగన్ను తిట్టడానికే సమయమంతా కేటాయించారు. జరిగింది చూసిన తర్వాత అసలు టీడీపీ మహానాడు పెట్టుకున్నదే జగన్ ను తిట్టడానికా అన్న అనుమానాలు పెరిగిపోతున్నాయి.
మామూలుగా ఏ పార్టీ అయినా ప్లానరీ లేదా మహానాడు లాంటి కార్యక్రమాలు పెట్టుకోవటం మామూలే. భారీ కార్యక్రమాలు ఎందుకు పెట్టుకుంటాయంటే తమ గొప్పదనం లేదా అధికారంలో ఉన్న పార్టీ అయితే తాము జనాలకు ఏమి చేశామని చెప్పుకునేందుకు ప్రాధాన్యతిస్తాయి. ఎన్నికలు దగ్గరలో ఉన్నపుడు తాము అధికారంలోకి వస్తే ప్రజలకు ఏమిచేస్తామనే విషయాన్ని వివరిస్తాయి. పార్టీ ప్రణాళికలను జనాలకు వినిపిస్తాయి. తమకు అధికారాన్ని అప్పగించమంటు విజ్ఞప్తి చేసుకుంటాయి.
కానీ ఇక్కడ చంద్రబాబు+తమ్ముళ్ళు చేసిందేమంటే జగన్ ను తిట్టడం. తాము అధికారంలోకి వస్తే ఏమిచేస్తామని చెప్పింది చాలా తక్కువ. ఎందుకంటే 2014-19 మధ్యలో చంద్రబాబు పరిపాలన ఎలాగుందో జనాలందరికీ బాగాగుర్తుంది. ఇచ్చిన హామీలను అధికారంలోకి రాగానే తుంగలో తొక్కేయటంలో చంద్రబాబును మించిన నేత మరొకరు లేరు. మరింత చెత్త క్రెడిబులిటి ఉన్న చంద్రబాబు తనకు జనాలు మళ్ళీ అధికార అందిస్తారని ఎలాగ అనుకుంటున్నారో అర్ధం కావటంలేదు. లాజికల్ గా అయితే టీడీపీకి అధికారం దక్కే అవకాశాలు తక్కువనే చెప్పాలి.
అందుకనే జనాల దృష్టిలో బూచిగా చూపించేందుకు చంద్రబాబు+తమ్ముళ్ళంతా జగన్నే టార్గెట్ చేసుకున్నారు. అంటే చంద్రబాబు అండ్ కో నే రెండురోజులు వరుసగా జగన్ కు ప్రచారం చేసినట్లయ్యింది. చంద్రబాబు, తమ్ముళ్ళు చెబుతున్నట్లు జగన్ మీద జనాలకు వ్యతిరేకత ఉందనే అనుకుందాం. మరిదే సమయంలో టీడీపీకి మళ్ళీ అధికారం అప్పగించాలని జనాలను అనుకుంటున్నారా ? చంద్రబాబుకు అధికారం అప్పగించేంత వ్యతిరేకత జనాల్లో జగన్ పైన ఉందా ? అన్నదే అసలు పాయింట్. మరీ ప్రశ్నకు తమ్ముళ్ళ దగ్గర సమాధానముందా ?