ఒంగోలులో జరిగిన మహానాడు సక్సెస్ జోష్ చంద్రబాబునాయుడు, తమ్ముళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తోంది. బహిరంగసభ సక్సెస్ అవ్వగానే వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేసినట్లే అని ఫీలైపోతున్నారు. ఇక్కడే చంద్రబాబు, లోకేష్ వైఖరి ఆశ్చర్యంగా ఉంది. ఒక బహిరంగసభ సక్సెస్ అయితే అధికారంలోకి వచ్చేయటం సాధ్యంకాదు. కానీ జగన్మోహన్ రెడ్డిపై వ్యతిరేకతతో కళ్ళుమూసుకుపోయిన తమ్ముళ్ళు ఈ విషయాన్ని అర్ధం చేసుకోలేకపోతున్నారు.
టీడీపీ వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలంటే కేవలం జగన్ను నిలువెల్లా వ్యతిరేకిస్తే సరిపోదు. చంద్రబాబు, ఎల్లోమీడియా చెప్పుకుంటున్నంతగా జనాల్లో జగన్ పై వ్యతిరేకత ఉందో లేదో ఎవరికీ తెలీదు. కాబట్టి జగన్ పైన వ్యతిరేకతే తమను అధికారంలోకి తెచ్చేస్తుందని చంద్రబాబు భ్రమల్లో ఉంటే మాత్రం మళ్ళీ ప్రతిపక్షంలోనే కూర్చోక తప్పదు. ఇక అసలు విషయం ఏమిటంటే అంశాలవారీగా చంద్రబాబు కేంద్రప్రభుత్వాన్ని కూడా నిలదీయటం మొదలుపెట్టాలి.
పెట్రోలు, డీజలు, గ్యాస్, వంటనూనెల్లాంటి ధరల పెరుగుదల పూర్తిగా కేంద్రానికి సంబంధించింది. అయితే చంద్రబాబు మాత్రం వీటికి కూడా జగన్నే తిడుతున్నారు. తనను గుడ్డిగా నమ్మేంత జనాలు ఎవరులేరని చంద్రబాబుకు అర్ధం కాకపోవటమే ఆశ్చర్యంగాఉంది. రాష్ట్రప్రభుత్వం తప్పులకు జగన్ను, కేంద్రప్రభుత్వం తప్పులకు నరేంద్రమోడిని నిలదీస్తేనే జనాలు చంద్రబాబును మెచ్చుకుంటారు. మోడీ అంటే భయంవల్ల అన్నింటికీ జగన్నే నిందిస్తున్న చంద్రబాబు వైఖరిని జనాలు ఆమోదించరు.
చంద్రబాబు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే ఎంత తక్కువేసుకున్నా టీడీపీకి 35 శాతం ఓటు బ్యాంకుంది. దీన్ని 40 శాతంకు పెంచుకోవాలంటే చంద్రబాబు రీజనబుల్ గా వ్యవహరించాలి. పార్టీలోని యువతకు పెద్దపీట వేయాలి. టికెట్ల కేటాయింపులో యువతకు ప్రాధాన్యత ఇవ్వాలి. 24 గంటలూ జగన్నే టిట్టడం మానేసి పార్టీ బాగుపైన దృష్టిపెట్టాలి. నియోజకవర్గాల్లో ఇన్చార్జిలను నియమించుకుని అభ్యర్ధుల ఎంపిక మీద దృష్టిపెట్టాలి. అప్పుడే పార్టీ వైపు జనాలు చూస్తారు. లేకపోతే 24 గంటలూ, 365 రోజులు ఎల్లోమీడియా అండతో జగన్ను తిట్టుకుంటు కూర్చోవాల్సిందే తప్ప వేరే దారిలేదు.