తాజాగా జరిగిన కోనసీమ, అమలాపురం హింసాత్మక ఘటనల్లో ఇప్పటికి సుమారు 50 మందిని పోలీసులు అరెస్టుచేశారు. ఈ ఘటనల్లో బాధ్యులను పోలీసులు ఇంకా వెతుకుతున్నారు. ఫొటోలు, వీడియోలు, సీసీ కెమెరా ఫుటేజీలు, వాట్సప్ గ్రూపులు తదితరాల ఆధారంగా పోలీసులు అనుమానితులను పట్టుకుంటున్నారు. తమకు దొరికిన ఆధారాల కారణంగా ఇప్పటికే మూడు విడతల్లో 50 మందిని అరెస్టుచేశారు. మరో 100 మందిని అరెస్టు చేసే అవకాశాలున్నాయని సమాచారం.
ఇప్పుడు అరెస్టుచేస్తున్న వారిపై పోలీసులు మామూలు కేసులు పెట్టడంలేదు. ఏదో ఆస్తులు ధ్వంసంచేయటం, బాధ్యులను గుర్తించి అరెస్టులు చేసి కోర్టులో ప్రవేశపెట్టాలని పోలీసులు అనుకోలేదు. అల్లర్లకు బాధ్యులుగా నూరుశాతం సాక్ష్యాలతో దొరికిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసులతో పాటు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తుల విధ్వంసం, వాటి విలువ రికవరీ (పబ్లిక్ అండ్ ప్రైవేట్ ప్రాపర్టీ డిస్ట్రక్షన్ అండ్ రికవరీ యాక్ట్) అనే చట్టాన్ని ప్రయోగిస్తున్నారట. ఈ చట్టం ఆధారంగా అరెస్టయిన వారి నేరాన్ని గనుక పోలీసులు కోర్టు విచారణలో నిరూపించగలిగితే అంతే సంగుతులు.
బాధ్యులపై ఆస్తుల విధ్వంసం, హింసకు పాల్పడటం, హింసను ప్రోత్సహించటం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్రపన్నటం అనే కేసులు ఎలాగూ నమోదవుతాయి. ఈ కేసుల ఆధారంగా అనేక సెక్షన్లకింద శిక్షలు కూడా పడతాయనటంలో సందేహంలేదు. వీటికి అదనంగా ప్రాపర్టీ రికవరీ యాక్ట్ కేసులు తోడవుతున్నాయి. ఇందులో విషయం ఏమిటంటే సదరు వ్యక్తులు ధ్వంసం చేసిన ఆస్తుల విలువను వారినుండే రికవరీ చేస్తారు. ఒకవేళ సదరు ఆస్తుల విలువను బాధ్యుల నుండి రికవరీ చేయటం సాధ్యం కాకపోతే అంతకు సమానమైన జైలుశిక్షను అధనంగా విధిస్తుంది కోర్టు.
ఉదాహరణకు దగ్ధమైన బస్సు విలువ సుమారు రు.20 లక్షలుంటుందని అనుకుంటే. అందుకు బాధ్యుల నుండే ఈ మొత్తాన్ని కోర్టు రికవరీ చేయిస్తుంది. వాళ్ళకు రికవరీ చేయటానికి ఆస్తులు లేకపోతే దానికి సమానంగా అదనపు శిక్ష విధిస్తుంది. విచారణలో బాధ్యులని కోర్టులో నిరూపణ అయితే వెంటనే కోర్టు వాళ్ళ ఆస్తులను అటాచ్ చేసేసుకుంటుంది. మరీ కేసుల ఫలితమేంటో తొందరలోనే తేలుతుంది.