సినిమాల్లో అందాల హీరోయిన్ గా, గొప్ప నటిగా పేరు తెచ్చుకున్న జయప్రద.. ఎన్టీఆర్ ప్రోత్సాహంతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత చంద్రబాబు హయాంలో కూడా ఆమె టీడీపీలోనే ఉన్నారు ఆమెకు రాజ్యసభ సభ్యత్వం ఇచ్చి టీడీపీ గౌరవించింది. ఆ తర్వాత ఆమె అనుకోకుండా యూపీ రాజకీయాల్లో ప్రవేశించారు. ఉత్తర ప్రదేశ్ వెళ్లారు, సమాజ్ వాది పార్టీలో చేరి ఎంపీగా గెలిచారు. పార్లమెంట్ లో కూర్చున్నారు. కొంతకాలం తర్వాత ఎస్పీలో లుకలుకలు మొదలయ్యాయి. ములాయం సింగ్ యాదవ్, అమర్ సింగ్ విడిపోయారు. అమర్ సింగ్ తోపాటే జయప్రద కూడా ఎస్పీ నుంచి బయటకు వచ్చేసి కొత్త పార్టీ పెట్టుకున్నారు. కానీ అది సక్సెస్ కాలేదు. దీంతో వారిద్దరి రాజకీయ ప్రయాణం ఇబ్బందుల్లో పడింది.
ఎస్పీ తర్వాత బయటకొచ్చి కొత్త పార్టీ పెట్టిన జయప్రద.. కాలక్రమంలో బీజేపీలో చేరారు. బీజేపీ తరపున ఎంపీగా పోటీచేసిన ఆమె ఓటమి చవిచూశారు. ఆ తర్వాత కొన్నాళ్లుగా జయప్రద రాజకీయంగా సైలెంట్ గా ఉన్నారు. ప్రస్తుతం ఆమె మళ్లీ తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై ఆసక్తి చూపించారు. అంటే కచ్చితంగా ఆమె 2024 నాటికి ఏదో ఒక ప్రధాన పార్టీ తరపున బరిలో దిగుతారని, ప్రచార పర్వంలో బిజీగా ఉంటారని తెలుస్తోంది. అయితే ఏ పార్టీనుంచి ఆమె పోటీ చేస్తారనేదే సస్పెన్స్. ఆమె బీజేపీలోనే కొనసాగితే.. తెలంగాణలో ఆ పార్టీ తరపున ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంటుంది. సికింద్రాబాద్ నుంచి ఆమె పోటీ చేసే అవకాశాన్ని కొట్టిపారేయలేం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. సికింద్రాబాద్ లోక్ సభ స్థానం పరిధిలో బీజేపీకి మంచి పట్టు ఉంది. దాన్ని నిలబెట్టుకుంటూ ఆమె అక్కడ పోటీ చేసే అవకాశముంది. ఒకవేళ ఏపీవైపు చూస్తే మాత్రం చంద్రబాబు, జగన్... వీరిద్దరిలో ఎవరో ఒకరు జయప్రదకు ఛాన్స్ ఇస్తారనే ప్రచారం కూడా ఉంది. 2024 నాటికి ఏ పార్టీకి ప్రజామోదం ఉంది అని జయప్రద భావిస్తే.. వారి వైపు వెళ్లడానికి ఆమె రెడీ అయ్యే అవకాశం కూడా ఉంది.