ఆమె ఒక నటిమాత్రమే. తనగురించి తాను చాలా ఎక్కువగా ఊహించుకుంటుంటారు. అలాంటిది ఆమెను తెలుగుదేశంపార్టీలో చేర్చుకుని అధికార ప్రతినిధి అనే పోస్టు కట్టబెట్టారు. పార్టీలోనే ఉన్నా అప్పుడప్పుడు తన అసంతృప్తిని బాహాటంగానే వెళ్ళగక్కుతుంటారు. అలాంటిది ఆమె పార్టీకి రాజీనామా చేశారు. ఈ నేపధ్యంలో పార్టీలోని గొడవలపైన, చంద్రబాబునాయుడు వైఖరిపైన తన అసంతృప్తిని వినిపించారు. అంతే ఒక్కదెబ్బకు పార్టీ మొత్తం షేకైపోయింది.






సినిమాల్లో దివ్యవాణి ఏమీ పెద్ద స్టార్ కూడా కాదు. అలాగని రాజకీయాల్లోకి వచ్చినాక ఆమె ఏమన్నా పార్టీకి ఉపయోగపడుతోందా అంటే అదీలేదు. ఏదో అధికారప్రతినిధి హోదాలో అప్పుడుప్పుడు ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డిపై ఆరోపణలు, విమర్శలు మాత్రమే చేస్తున్నారు. ఈమె చెబితే పార్టీకి ఓట్లేసేవాళ్ళు లేరు. అలాగని చెప్పలేదని ఎగస్పార్టీకి ఓట్లేసే వాళ్ళూలేరు. పార్టీలో ఉన్నంత మాత్రాన టీడీపీకి ఒరిగే లాభమూలేదు. ఈమె వల్ల అధికారపార్టీకి జరిగే నష్టమూలేదు. దివ్యవాణి మరచిపోయిందేమంటే సినిమావాళ్ళు టీడీపీకి కొత్తేమీకాదు. దివ్యవాణి మొదలూకాదు చివరా కాదు. పార్టీ ఇలాంటివాళ్ళని చాలామందిని చూసింది.  






ఇలాంటి ఆమె తాను రాజీనామా చేసినట్లు ట్విట్టర్లో ప్రకటించగానే చంద్రబాబు అండ్ కో అద్దిరిపోయారు.  ఆమె రాజీనామాతో అందరు ఎందుకింతగా కంగారుపడిపోయారో అర్ధం కావటంలేదు. వెంటనే కొందరు నేతలను రంగంలోకి దింపి ఆమెతో చంద్రబాబు వరసబెట్టి మాట్లాడించారు. సాయంత్రానికి పార్టీ ఆఫీసుకు పిలిపించుకుని రాజీనామా ఉపసంహరించుకుంటున్నట్లు ఆమెతోనే ప్రకటనిప్పించారు. విచిత్రమేమిటంటే అధికారాలు లేని అధికారప్రతినిధి పోస్టు తనకెందుకు అంటు ఘాటు వ్యాఖ్యలు చేశారు.






అసలు అధికారప్రతినిధి పోస్టంటే ఏమిటో కూడా దివ్యవాణికి తెలీదని అర్ధమైపోతోంది. అధికారప్రతినిధి అంటే పేరులో మాత్రమే అధికారం ఉంటుంది కానీ ఇంకేమీ ఉండదని కూడా ఆమెకు తెలీదు. పార్టీ వాయిస్ ను వినిపించటమే అధికారప్రతినిధుల బాధ్యత. అధికారప్రతినిధి అంటే ఆమె ఏదో పెద్ద ప్రభుత్వ పదవి అనుకున్నట్లున్నారు. పైగా మహానాడులో తనను మాట్లాడనివ్వలేదని అలగటం ఒకటి. దశాబ్దాలుగా పార్టీలో ఉన్నవారికే మాట్లాడే అవకాశం రాలేదు. చూడబోతుంటే పార్టీకి భవిష్యత్తు లేదని అర్ధమైనట్లుంది. అందుకనే ఏదో సాకుచెప్పి పార్టీ నుండి తప్పుకున్నారు. లేదా చంద్రబాబు అటెన్షన్ కోసం రాజీనామా డ్రామా అడారా ?


మరింత సమాచారం తెలుసుకోండి: