జనసేన అధినేత పవన్ కల్యాన్ సోదరుడు నాగుబాబు వ్యవహారం చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానం పెరిగిపోతోంది. జూన్ 1వ తేదీనుండి నాగుబాబు ఉత్తరాంధ్రలో పర్యటించబోతున్నారు. ఇప్పటివరకు పార్టీలో పలానా ప్రాంతానికి బాధ్యులు అని ప్రత్యేకించి ఎవరినీ పవన్ నియమించలేదు. పవన్ తర్వాత పార్టీ వ్యవహారాలు మొత్తాన్ని రాజకీయ వ్యవహారాల కమిటి ఛైర్మన్ నాదెండ్ల మనోహరే చూస్తున్నారు. అలాంటిది ఉత్తరాంధ్రకు ప్రత్యేకించి నాగుబాబును బాద్యుడిగా ప్రకటించారు.





ప్రత్యేకించి ఉత్తరాంధ్రకే నాగుబాబును బాధ్యుడిగా పవన్ ఎందుకు ప్రకటించారనే చర్చ పార్టీలో మొదలైంది. ఎందుకంటే ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం నుండి గానీ లేదా అనకాపల్లి నుండి నాగుబాబు ఎంపీగా పోటీచేయాలని ఆసక్తిగా ఉన్నారట. మొన్నటి ఎన్నికల్లో నాగుబాబు పశ్చిమగోదావరి జిల్లాలోని నరసాపురం ఎంపీగా పోటీచేసి ఓడిపోయిన విషయం తెలిసిందే. ఎంపీగా ఓడిపోయినా సుమారు 2.5 లక్షల ఓట్లయితే వచ్చాయి.






అయితే వచ్చే ఎన్నికల్లో జనసేన తరపున పోటీచేయటానికి వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజు రెడీ అవుతున్నారట. వచ్చే ఎన్నికలనాటికి రఘురామ జనసేనలో చేరటం ఖాయమని పార్టీవర్గాలే చెబుతున్నాయి. జనసేనలో చేరితేనే టీడీపీ మద్దతు కూడగట్టడం సాధ్యమవుతుందని తిరుగుబాటు ఎంపీ ప్లాన్ చేస్తున్నారట. అదే టీడీపీలో చేరితే మిత్రపక్షాలైన బీజేపీ+జనసేన మద్దతు డౌటేనట. అంటే పై మూడు పార్టీల మధ్య పొత్తు లేకపోయినా తాను జనసేనలో చేరితే టీడీపీ మద్దతిస్తుందని రఘురామ లెక్కలేసుకుంటున్నారు.






సో, నరసాపురం రఘురామకు ఖాయమైపోయింది కాబట్టి తాను వేరే సీటు వెతుక్కోక తప్పలేదు నాగుబాబుకు. అందుకనే గతంలో తమ బావగారు అల్లు అరవింద్ పోటీచేసి ఓడిపోయిన అనకాపల్లి సీటు బాగుంటుందని అనుకున్నారట. అలాగే మొన్న జనసేన తరపున పోటీచేసి ఓడిపోయిన లక్ష్మీనారాయణకు కూడా సుమారు లక్ష ఓట్లొచ్చిన వైజాగ్ కూడా ఓకేనే అనుకున్నారట. అందుకనే ఈ రెండు నియోజకవర్గాలున్న ఉత్తరాంధ్రపై నాగుబాబు ప్రత్యేకించి కన్నేశారట. సోదరుడితో మాట్లాడుకున్న తర్వాతే ఉత్తరాంధ్రకు నాగుబాబు బాధ్యుడిగా వస్తున్నారు. మరి నాగుబాబు ఆలోచనలు ఎంతవరకు వర్కవుటవుతాయో చూడాల్సిందే.



మరింత సమాచారం తెలుసుకోండి: