బొంకరా బొంకరా పోలిగా అంటే మాఊరి మిరియాలు తాటికాయలంత అన్నాడట వెనకటికి ఎవడో. ఈ సామెతలో చెప్పినట్లే ఉంది బీజేపీ చీఫ్ సోమువీర్రాజు మాటలు. తాము అధికారంలోకి రాగానే అమరావతిలోనే రాజధాని నిర్మించేస్తారట. రాజధాని నిర్మాణం కోసం కేంద్రం నుండి రు. 10 వేల కోట్లు తీసుకొస్తారట. వీర్రాజు తాజా మాటలు విన్నతర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చేదెప్పుడు..కేంద్రం రు. 10 వేల కోట్లిచ్చేదెప్పుడు..బీజేపీ రాజధాని నిర్మించేదెప్పుడు అనే సందేహాలు పెరిగిపోతున్నాయి.





వీర్రాజు చెప్పేమాటలు విన్నతర్వాత ఇదంతా జరిగేపనికాదని అందరికీ అర్ధమైపోయింది. ఎందుకంటే తాము అధికారంలోకి రావటం ఖాయమని వీర్రాజు ఎప్పటినుండో చెబుతున్నారు. నిజంగా ప్రతిపక్షంలో ఉన్న సీనియర్ నేత అలా చెప్పకపోతే తేడా కొట్టేస్తుందికదా. కారణం ఏమిటంటే ఎప్పుడో జరగబోయే ఎన్నికల్లో గెలిచి, రాజధాని నిర్మించటం కాదు ముందు ఆత్మకూరులో అభ్యర్ధిని పెట్టుకోమని జనాలు ఎగతాళి చేస్తున్నారు.






ఈనెల 23వ తేదీన జరగబోయే నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ ఉపఎన్నికలో బీజేపీ పోటీచేస్తోంది. ఆ ఎన్నికల్లో అభ్యర్ధిని ఎంపికచేయటమే పెద్ద సమస్యగా మారిపోయింది. ఎందుకంటే ఊరికిముందే బీజేపీ పోటీచేయటం ఖాయమని వీర్రాజు ప్రకటించేశారు. ఇపుడు పోటీచేయటానికి అభ్యర్ధే దొరకటంలేదు. పార్టీలో ఉన్న సీనియర్లను పోటీచేయమంటే ఎవరు ముందుకు రావటంలేదట. అలాగని కొత్తవాళ్ళతో పోటీ చేయిద్దామంటే పార్టీ నేతలు అంగీకరించటంలేదని సమాచారం.






పార్టీ తరపున పోటీచేయటానికి బిజివేముల రవీంద్రనాధరెడ్డి రెడీగా ఉన్నారు. అయితే ఈయన్ను పార్టీలోని సీనియర్లందరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారట. చివరికి ఏమవుతుందో తెలీదుకానీ ఇప్పటికైతే పార్టీ తరపున పోటీచేయటానికి అభ్యర్ధే లేరన్నది వాస్తవం. ఒక్క ఉపఎన్నికలోనే అభ్యర్ధిని పోటీలోకి దింపలేని పార్టీ రేపటి సాధారణ ఎన్నికలో అధికారంలోకి వచ్చేస్తామని చెబితే ఎవరైనా నమ్ముతారా ? ఉపఎన్నిక జరగటం ఖాయమని తెలిసీ అభ్యర్ధిని రెడీ చేసుకోలేకపోవటం వీర్రాజు చేతకానితనం కాదా ?  ఇలాంటి పార్టీ అధికారంలోకి వచ్చి రాజధానిని నిర్మించేస్తామంటే నమ్మేవాళ్ళెవరైనా ఉన్నారా ?


మరింత సమాచారం తెలుసుకోండి: