ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబునాయుడు రాజకీయం జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఇప్పటికి అర్ధమైనట్లుంది. తాజాగా మీడియాతో మాట్లాడినపుడు పవన్ చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. నిజానికి మొదటినుండి పొత్తులపై పవన్లో బాగా కన్ఫ్యూజనే కనబడుతోంది. ఇటు మిత్రపక్షం బీజేపీ నేతలు పొత్తులపై క్లారిటితోనే ఉన్నారు. అటు చంద్రబాబు మరింత పిచ్చ క్లారిటితో ఉన్నారు. ఎటుతిరిగి క్లారిటి లేకుండా అయోమయంలో ఉన్నది పవన్ మాత్రమే.
జనసేనకు అప్పుడెప్పుడో లవ్ ప్రపోజల్ పంపిన చంద్రబాబు వైఖరి ఇపుడు పవన్ కు మింగుడుపుడుతున్నట్లు లేదు. అప్పట్లో లవ్ ప్రపోజ్ చేసి వచ్చే ఎన్నికల్లో వార్ వన్ సైడే అని, ఎన్నికలు ఏకపక్షమే, టీడీపీ గెలుపు ఖాయమని చంద్రబాబు చేస్తున్న ప్రకటనలను పవన్ ఉదహరించారు. తనకు పరిస్ధితులు సానుకూలంగా ఉన్నపుడు ఎవరినీ దగ్గరకు చేరనీయకపోవటం, పరిస్ధితులు వ్యతిరేకంగా ఉన్నపుడు అందరి కాళ్ళూ పట్టుకోవటం చంద్రబాబుకు బాగా అలవాటే.
చంద్రబాబు నైజం బీజేపీ బాబులకు బాగా తెలుసుకాబట్టే మొదటినుండి పొత్తు ప్రపోజల్ ను ఎక్కడికక్కడ తెగ్గొట్టేస్తున్నారు. చంద్రబాబుతో పొత్తుపై పవన్ పదే పదే పరోక్షంగా ప్రస్తావిస్తున్నా బీజేపీ చీఫ్ సోమువీర్రాజు మాత్రం చంద్రబాబుతో పొత్తుండని స్పష్టంగా పదే పదే చెబుతున్నారు. ఇదే సమయంలో వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపు గ్యారెంటీ అని అనుకుంటున్న చంద్రబాబు కూడా పొత్తుల విషయాన్ని ఎక్కడా ప్రస్తావించటంలేదు.
ఎందుకంటే ఒంటిరిగా పోటీచేసినా గెలుపు గ్యారెంటీ అయినపుడు ఇక జనసేనతో పొత్తెందుకంటు కొందరు తమ్ముళ్ళు గట్టిగా వాదన మొదలుపెట్టారట. దీనికి చంద్రబాబు కూడా సానుకూలంగా ఉన్నకారణంగానే పొత్తులపై అస్సలు మాట్లడటంలేదు. అంటే ఇటు బీజేపీ కూడా పవన్ను నమ్మే పరిస్ధితిలేదు. అటు చంద్రబాబూ పొత్తులపై ఆసక్తిగా లేరు. అంటే మధ్యలో నెత్తిన గుడ్డేసుకునేది తానే అన్న విషయం పవన్ కు ఇప్పటికి క్లారిటి వచ్చినట్లుంది. అందుకనే అవసరమైతే ఒంటరిపోటీకి కూడా రెడీ అంటు పవన్ తాజాగా ప్రకటించారు.