ఇంతకీ పవన్ ఏమన్నారు..?
మంగళగిరిలో జనసేన విస్తృత స్థాయి సమావేశంలో 2024 ఎన్నికలకు సంబంధించి పొత్తులపై మూడు ఆప్షన్లు ఉన్నాయని అన్నారు పవన్ కల్యాణ్. ఒంటరిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఒక ఆప్షన్. బీజేపీతో జనసేన కలిసి వెళ్లడం రెండో ఆప్షన్. బీజేపీ, టీడీపీతో కలిసి జనసేన పోటీ చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం మూడో ఆప్షన్. ఈ మూడు ఆప్షన్లలో ఏదో ఒకటి మనం ఎంచుకోవాల్సి ఉందని అన్నారు పవన్. పవన్ ఆప్షన్లలో రెండోది బాగుందని, బీజేపీ, జనసేన కలసి పోటీ చేస్తాయని అన్నారు సోము వీర్రాజు. అయితే టీడీపీ మాత్రం ఊరుకోవడంలేదు. పవన్ కల్యాణ్ మనకి ఆప్షన్లు ఇచ్చేదేంటి, మనమే వారికి ఆప్షన్ ఇవ్వాలని సోషల్ మీడియా వింగ్ తరపున పోస్టింగ్ లు పెట్టిస్తున్నారు నేతలు.
జనసేనతో పొత్తును టీడీపీలో ఉన్న 90 శాతం మంది వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తోంది. జనసేనతో పొత్తు పెట్టుకుంటే సీట్ల విషయంలో గొడవలు వస్తాయని, ఇప్పటికే పవన్ తగ్గాను తగ్గాను, ఇక తగ్గను అంటున్నారని, అలా తగ్గకుండా ఉంటే తమ సీట్లు త్యాగం చేయాల్సి వస్తుందని అంటున్నారు. పవన్ కల్యాణ్ కే తాము నాలుగో ఆప్షన్ ఇస్తామంటున్నారు. పవన్ ఇక రాజకీయాలు ఆపేసి, సినిమాలు చేసుకోవాలని, ఫుల్ టైమ్ రాజకీయాల్లో ఉన్నవారు ఆ పని చూసుకుంటారని వెటకారంగా పోస్టింగ్ లు పెడుతున్నారు. తగ్గాను, తగ్గాను అంటున్న పవన్, సినిమాల్లో కూడా కాస్త తగ్గి చూపించాలని, ఇన్నాళ్లూ తనకోసం తగ్గి కేవలం నిర్మాతగానే ఉన్న బండ్ల గణేష్ ని హీరోగా పెట్టి, పవన్ కల్యాణ్ నిర్మాతగా సినిమా చేయాలని కూడా సెటైర్లు పేలుస్తున్నారు.
పవన్ వైపు నుంచి రియాక్షన్ ఉంటుందా..?
జనసైనికులు మాత్రం టీడీపీకి కౌంటర్లు ఇస్తున్నారు. కానీ పార్టీ తరపున అధికారికంగా ఎలాంటి ప్రకటన కూడా విడుదల కాలేదు. సహజంగా పవన్ కల్యాణ్ ఇలాంటి వాటిపై వెంటనే రియాక్ట్ అవుతారు. గతంలో చంద్రబాబు వన్ సైడ్ లవ్ అన్నప్పుడు కూడా ఆయన రియాక్ట్ అయ్యారు. ఇప్పుడు టీడీపీ తరపున పొత్తులపై వస్తున్న వ్యతిరేకతపై పవన్ ఎలా స్పందిస్తారో చూడాలి.