అధికారంలోకి వచ్చేయటం ఖాయమని, ఎన్నికలు ఎప్పుడు పెట్టిన గెలుపు వన్ సైడే అని చంద్రబాబునాయుడు ఒకవైపు చెబుతుంటే మరోవైపు తమ్ముళ్ళు పెద్ద షాకే ఇచ్చారు. కడపలోని ఒక హోటల్లో మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన టీడీపీ నేతల సమావేశంలో కొందరు తమ్ముళ్ళు చంద్రబాబు, లోకేష్ వైఖరిపై మండిపోయారు. జిల్లాపార్టీకి చెప్పకుండా, తెలియకుండానే పార్టీని వదిలేసి వెళ్ళిపోయిన కొందరు నేతలను చంద్రబాబు, లోకేష్ ఎలా కలుస్తారంటు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తంచేశారు.





ఇంతకీ విషయం ఏమిటంటే ఈమధ్యనే కడప జిల్లాలోని కమలాపురం మాజీ ఎంఎల్ఏ వీరశివారెడ్డి టీడీపీ ఆఫీసులో లోకేష్ ను కలిసిన విషయం తెలిసిందే. తొందరలోనే తాను టీడీపీలో చేరబోతున్నట్లు శివారెడ్డి ప్రకటించారు. ఆ విషయమై కమలాపురం ఇన్చార్జి పుత్తా నరసింహారెడ్డి మండిపోయారు. 2019 ఎన్నికల్లో వైసీపీ గెలుపుకు సహకరించిన వ్యక్తిని టీడీపీలో ఎలా చేర్చుకుంటారంటు నిలదీశారు. అలాగే కమలాపురం నియోజకవర్గం వ్యవహారాల్లో పాలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి, ఎంఎల్సీ, పులివెందుల ఇన్చార్జి బీటెక్ రవి జోక్యం చేసుకుంటున్నారంటు ఫుల్లుగా ఫైరయ్యారు. ఈ స్ధాయి వ్యతిరేకతను సోమిరెడ్డి ఊహించుండరు. 





ఇదే విషయమై సోమిరెడ్డి సమక్షంలోనే పై ముగ్గురు నేతల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇక మాజీమంత్రి డీఎల్ రవీంద్రారెడ్డిని పార్టీలోకి ఎలా చేర్చుకుంటారంటు మైదుకూరు ఇన్చార్జి సుధాకర్ యాదవ్ ఫైరయ్యారు. ఇదే సమయంలో ప్రొద్దుటూరు మాజీ ఎంఎల్ఏ వరదరాజులరెడ్డిని పార్టీలో చేర్చుకుంటే ఒప్పుకునేదిలేదని మాజీ ఎంఎల్ఏ లింగారెడ్డి తెగేసిచెప్పారు.





కడప పార్టీ నేతల అభిప్రాయాలు తీసుకోకుండా, తెలియకుండా శివారెడ్డి, డీఎల్, వరదరాజులరెడ్డిని ఎట్టి పరిస్దితుల్లోను చేర్చుకునేందుకు లేదన్నారు. ఒకవేళ తమకు తెలీకుండా పార్టీలో చేర్చుకుంటే తాము అంగీకరించేదిలేదని డైరెక్టుగానే తేల్చిచెప్పేశారు. దాంతో  సోమిరెడ్డికి షాక్ కొట్టినట్లయ్యింది. జిల్లాలోని నేతలు డైరెక్టుగా చంద్రబాబు, లోకేష్ కే వార్నింగిస్తున్నట్లుగా మాట్లాడుతారని సోమిరెడ్డి ఊహించుండరు. ఇంతకీ వీళ్ళు వార్నింగిచ్చింది తనకా లేకపోతే చంద్రబాబు, లోకేష్ కా అన్నది సోమిరెడ్డికి అర్ధంకాలేదు.


 

మరింత సమాచారం తెలుసుకోండి: