రాజకీయాల్లో విభేదాలు ఉండొచ్చు కానీ, పవన్.. జగన్ నే స్ఫూర్తిగా తీసుకున్నట్టు తెలుస్తోంది. వచ్చే సారి అధికారంలోకి వచ్చేందుకు జనసేనాని సిన్సియర్ గా కష్టపడుతున్నారు. ఓవైపు రైతులకు సాయం చేస్తూనే, మరోవైపు తన రాజకీయ కార్యాచరణ మొదలు పెట్టారు. జిల్లాల పర్యటనలతో ఆయన పూర్తిగా రాజకీయాల్లో నిమగ్నం అయ్యేందుకు ప్లాన్ రెడీ చేస్తున్నారు. దసరా తర్వాత ఈ ప్లాన్ పూర్తిగా పట్టాలెక్కుతుంది.
పొత్తుల సంగతేంటి..?
పవన్ కల్యాణ్ గతంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చను అన్నారు, అంటే ఆయన కచ్చితంగా విపక్షాలన్నీ కలసి పోటీ చేసే ఆలోచనలో ఉన్నారు. ఆ తర్వాత మూడు ఆప్షన్లు ఇచ్చారు. తాజాగా ప్రకాశం జిల్లా పర్యటనలో జనంతోనే పొత్తు అని చెబుతున్నారు పవన్ కల్యాణ్. మరిప్పుడు పవన్ జనంతోనే పొత్తు అని తాజాగా ప్రకటించారు. ప్రకాశం జిల్లా పర్యటనలో పవన్ తాను అన్న మాటకు ఫిక్స్ అయితే మాత్రం 2024లో జనసేన ఒంటరిగా పోటీ చేస్తుంది. ఆలోపు రాజకీయ అవకసరాలకోసం ఆయన మాట మారిస్తే మాత్రం కచ్చితంగా ఏదో ఒక పార్టీ బుట్టలో పడతారు, వారితోనే పొత్తు అంటారు, ఆ తర్వాత పాత కథే మొదలవుతుంది. మొత్తమ్మీద పవన్ కల్యాణ్ ఇన్నాళ్లకు జనంతోనే పొత్తు, పార్టీలతో కాదు అన్నారని జనసైనికులు సంబరపడిపోతున్నారు. 2024 ఎన్నికల్లో జనసేన ఒంటరిగా పోటీ చేస్తే కచ్చితంగా ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయినా, ప్రభుత్వ ఏర్పాటులో భాగస్వామి అయ్యే అవకాశముందని అంటున్నారు. ఎన్నికల తర్వాత పొత్తు పెట్టుకోవచ్చని, ముందుగా పొత్తులతో చిత్తవడం వృథా అని అనుకుంటున్నారు జనసైనికులు.