వైసీపీ నరసాపురం తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజు రెడీగా ఉండాల్సిందేనా ? తొందరలోనే తెలంగాణా పోలీసులో లేకపోతే ఏపీ పోలీసులో మరో కేసు నమోదు చేసేట్లుగానే ఉన్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే సోమవారం ఎంపీ ఇంటి దగ్గర అనుమానాస్పదంగా ఉన్న ఒక వ్యక్తిని రఘురామ వ్యక్తిగత సిబ్బంది+భద్రతగా ఉన్న సీఆర్పీఎఫ్ సిబ్బంది పట్టుకున్నారు. అతని దగ్గరకు వచ్చి పట్టుకుని ఒక కారులో వేసుకుని వెళ్ళిపోయారు. నేరుగా ఎంపీ ఇంట్లోకి తీసుకెళ్ళి చావ చితక్కొట్టారట.
ఎందుకా వ్యక్తిని పట్టుకుని కొట్టారంటే అతను అనుమానాస్పందగా ఎంపీ ఇంటిదగ్గర తిరుగుతున్నారట. అలాగే ఎంపీ ఇంటితో పాటు చుట్టుపక్కల వీడియో తీస్తున్నాడని వీళ్ళు చెబుతున్నారు. అయితే సదరు వ్యక్తి ఏపీ ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ ఫరూక్ భాషానట. తనను గట్టిగా పట్టుకుని కారులోకి ఈడ్చుకెళ్ళి ఎంపీ ఇంట్లోకి లాక్కెళ్ళి కొట్టారని అతను చెబుతున్నాడు. తాను ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ అని, ప్రధానమంత్రి రాకసందర్భంగా ఐఎస్బీ దగ్గర డ్యూటిలో ఉన్నట్లు చెప్పినా వినకుండా కొట్టినట్లు ఆరోపిస్తున్నాడు.
తనను ఇంట్లోకి తీసుకెళ్ళి కొట్టినపుడు ఎంపీ ఇంట్లోనే ఉన్నారని ఆయన ప్రోదల్బంతోనే వ్యక్తిగత సిబ్బందితో పాటు భద్రతా సిబ్బంది కొట్టినట్లు గచ్చిబౌలి పోలీసులకు ఫరూక్ ఫిర్యాదుచేశాడు. సదరు వ్యక్తిని బాగా కొట్టిన ఎంపీ సిబ్బంది తర్వాత గచ్చిబౌలి పోలీసుస్టేషన్లో అప్పగించి ఫిర్యాదుచేశారు. అదే సమయంలో ఫరూక్ కూడా ఎంపీ సిబ్బందిపై ఫిర్యాదుచేశాడు. ఈ మొత్తం వ్యవహారం అటు తిరిగి ఇటు తిరిగి చివరకు ఎంపీ మీదకే వచ్చేట్లుంది. ఎలాగంటే జగన్మోహన్ రెడ్డిని ఏమీ చేయలేని ఎంపీ ఆ కోపాన్నంతా ఫరూఖ్ పై చూపినట్లు ఆరోపణలు పెరిగిపోతున్నాయి.
లేకపోతే డ్యూటిలో ఉన్న కానిస్టేబుల్ ను కొట్టటం ఏమిటనే ప్రశ్నవస్తోంది. ఎంపీ ఆదేశాల కారణంగా ఆయన సిబ్బంది తన కొట్టినట్లు ఫరూక్ చెబుతున్నాడు. చివరకు పోలీసులు ఎంపీ మీద కేసు పెడితే గనుక రఘురామ పనైపోయినట్లే. ఎందుకంటే తెలంగాణాలో కేసు కట్టి తర్వాత దాన్ని ఏపీ పోలీసులకు ట్రాన్స్ ఫర్ చేస్తే అప్పుడు మొదలవుతుంది అసలు సినిమా.