ఎన్నికలు ఎప్పుడు జరిగినా టీడీపీదే అధికారం..ఎన్నికలు ఎప్పుడు వచ్చినా గెలుపు వన్ సైడే..ఇది చంద్రబాబునాయుడు తరచు చెప్పే మాటలు. తాజాగా సొంతజిల్లా చిత్తూరు పర్యటనలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు చేయటంలో ఇంటికొకరు రావాలని పిలుపిచ్చారు. అంతాబాగానే ఉంది కానీ అసలు పార్టీ పరిస్ధితి ఏమిటి ? అనేది చాలా కీలకం.






మిగిలిన జిల్లాల్లో పార్టీ పరిస్ధితి ఎలాగుందన్నది పక్కన పెట్టేస్తే చిత్తూరులో మాత్రం ఘోరమైన పరిస్దితులో ఉందనే చెప్పాలి. ఉమ్మడి జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో తక్కువలో తక్కువ 11 నియోజకవర్గాల్లో పరిస్ధితి ఏమాత్రం బావోలేదని స్వయంగా ఎల్లోమీడియానే నెత్తినోరు మొత్తుకుంటున్నది. 11 నియోజకవర్గాల్లో కూడా 8 నియోజకవర్గాల్లో ఇన్చార్జీలే లేరు. మిగిలిన మూడు నియోజకవర్గాల్లో సీనియర్ నేతల మధ్య ఆధిపత్య గొడవలతో వర్గాలుగా విడిపోయి ఎప్పుడు గొడవలు పడుతునే ఉన్నారు.





చిత్తూరు, పూతలపట్టు, గంగాధరనెల్లూరు నియోజకవర్గాల్లో ఇన్చార్జీలెవరో తెలీదు. తంబళ్ళపల్లె, సత్యవేడులో పార్టీ కార్యక్రమాలను పర్యవేక్షించే నేతలకు దిక్కేలేదు. సత్యవేడులో అయితే రెండువర్గాలు ఒకదాంతో మరొకటి గొడవలు పడుతునే ఉంటుంది. మదనపల్లె నియోజకవర్గంలో నేతలు ఎక్కువైపోవటంతో ఎవరిని నియమించాలో తెలీక అసలు ఇన్చార్జినే పెట్టలేదు. తిరుపతి, పుంగనూరు, శ్రీకాళహస్తి, చంద్రగిరిలో ఇన్చార్జిలు ఉన్నా క్యాడర్ కు అందుబాటులో ఉండటంలేదు. పైగా శ్రీకాళహస్తి, పుంగనూరు ఇన్చార్జిలపై పార్టీలోనే తీవ్ర వ్యతిరేకతుంది. ఇక తిరుపతిలో లీడర్లు ఎక్కువైపోవటంతో ప్రతిరోజు గొడవలే.





కుప్పం, పలమనేరు, పీలేరు నియోజకవర్గాల్లో ఇన్చార్జిల సమస్యలేదు. కాకపోతే మూడు నియోజకవర్గాల్లో కుప్పంలోనే ద్వితీయ శ్రేణినేతలు, కార్యకర్తలు వైసీపీలోకి వెళ్ళిపోతుండటం చంద్రబాబుకు ఇబ్బంది కలిగించేదే. పలమనేరులో అమర్నాధరెడ్డి పర్వాలేదు కానీ పీలేరులో అభ్యర్ధి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి బాగా వీకనే చెప్పాలి. ఇక నగిరిలో గాలి ముద్దుకృష్ణమనాయుడు కుటుంబంలోనే చీలికలు వచ్చేశాయి. పెద్దకొడుకు భానుప్రకాష్ ను ముద్దు భార్య, రెండో కొడుకు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇంటి పంచాయితి తీరితే కానీ ఇన్చార్జి ఎవరో తెలీదు. ఇది చంద్రబాబు సొంతజిల్లాలో పార్టీ పరిస్ధితి.



మరింత సమాచారం తెలుసుకోండి: